cm kcr review on Nalgonda: నల్గొండ పట్టణ అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా పనుల జాప్యంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఆదేశించిన పనులు ఎంతవరకు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆధునిక హంగులతో, ఆహ్లాదకరమైన రీతిలో 'నల్లగొండ కళాభారతి ' సాంస్కృతిక కేంద్రాన్ని తీర్చిదిద్దాలని అన్నారు. దాదాపు 2000 మంది కూర్చునే సామర్థ్యంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. అంతకుముందు సీఎం కేసీఆర్ నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల ఎమ్మెల్యే తండ్రి నర్సింహ మృతి చెందగా.. దశదినకర్మ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. నార్కట్‌పల్లిలోని రాశి ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేసిన సంతాప కార్యక్రమంలో పాల్గొన్నారు.
పానగల్లు ఉదయ సముద్రం ట్యాంక్ బండ్‌ను పచ్చదనంతో సుందరీకరించాలన్నారు. నల్గొండ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు సెలవుల్లో వచ్చి కుటుంబ సభ్యులు, పిల్లలతో ఆహ్లాదంగా గడిపేలా సౌకర్యాలు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రముఖ ఆర్కిటెక్ట్స్ నుంచి డిజైన్లు తెప్పించుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఇప్పటికే ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణ పనులను సీఎం పర్యవేక్షించారు. ఫొటోలు, నివేదికల ద్వారా పనుల పురోగతిని కేసీఆర్ పరిశీలించారు. నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, మున్సిపల్ కమిషనర్ రమణాచారి, ఇతర అధికారులు ముఖ్యమంత్రికి పనుల పురోగతిని వివరించారు.
ప్రజలు కుటుంబంతో కలసి మార్కెట్‌కు వచ్చినప్పుడు పిల్లలు ఆడుకోవడానికి, వారికి రక్షణతో కూడిన పచ్చని పార్కు, ఆటస్థలంతో కూడిన చిల్డ్రన్ కేజ్‌ను ఏర్పాటు చేయాలనీ సీఎం ఆదేశించారు. పట్టణంలో వీలైన చోటల్లా అర్బన్ పార్కులను ఏర్పాటు చేయాలన్నారు. నగరంలో పచ్చదనం, నర్సరీల గురించి సీఎం ఆరా తీశారు. విరివిగా మొక్కలు నాటడంతో పాటు, రహదారుల విస్తరణ, తదితర కారణాలతో తొలగిస్తున్న పెద్ద పెద్ద వృక్షాలను ట్రాన్స్ లొకేషన్ చేస్తున్నామని ముఖ్యమంత్రికి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వివరించారు.