ప్రభుత్వం ఎస్సీల సంక్షేమం కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుని.. వారి అభివృద్ధికి కృషి చేస్తోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామంలోని పల్లెప్రగతి (Palle Pragathi) కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఎస్సీలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి రూ.10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నమని వెల్లడించారు. ప్రతి సంవత్సరం లాటరీ పద్ధతిన అర్హులను ఎంపిక చేస్తున్నామని తెలిపారు.
వీలైనంత త్వరగా పరిష్కరించండి
గ్రామాల అభివృద్ధిని ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని.. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) మాత్రమే ప్రత్యేక దృష్టి సారించి పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలు చేపట్టారని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు. హరితహారంలో (Haritha Haram) భాగంగా ప్రతి గ్రామంలో మొక్కలు నాటడం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, వైకుంఠ ధామాలు, తడి పొడి చెత్త సేకరణ, విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పల్లె ప్రగతి (Palle Pragathi)లో గుర్తించిన అన్ని సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కారించాలని ఆదేశించారు.