Palamuru University students dharna : పాలమూరు విశ్వవిద్యాలయంని వసతి గృహాల్లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు నిరసన చేపట్టారు. విశ్వవిద్యాలయ ప్రధాన ద్వారం ముందు ధర్నా నిర్వహించారు. గేటు మూసివేసి విశ్వవిద్యాలయ ఆచార్యులు, సిబ్బంది, విద్యార్ధులు క్యాంపస్లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు.
వసతి గృహాల్లో ఒక్కో గదిలో ఆరు నుంచి ఏడు మంది విద్యార్థినులు ఉంటున్నారని... కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఏమవుతుందోనని తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆరోగ్య కేంద్రం ఉన్నా.. వైద్యులు, మందులు ఉండకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తుందని వాపోయారు. వీటికి తోడు ఫీజులు పెంచారని మండిపడ్డారు. ఉప కులపతి రావాలని... తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ నిరసన విరమించేది లేదని స్పష్టం చేశారు.