KTR suggestions to job Aspirants: సర్కారు కొలువు సాధించాలంటే ఉద్యోగార్థులు.. రాబోయే ఆరు నెలలూ సామాజిక మాధ్యమాలు, టీవీలకు దూరంగా ఉండాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ 6 నెలలు వారికెంతో కీలకమని.. కష్టపడి చదివి కొలువు సాధించాలని ఆకాంక్షించారు. సుమారు 90 వేల ఉద్యోగాలతో ముఖ్యమంత్రి కేసీఆర్.. కొలువుల కుంభమేళా చేపట్టారని.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఈ మేరకు మహబూబ్ నగర్ పట్టణంలో ఎక్స్పో ప్లాజా వద్ద శాంతా నారాయణ గౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్లో ఉద్యోగార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి కేటీఆర్ అందజేశారు.
"ఉద్యోగార్థులకు రాబోయే ఆరు నెలలు ఎంతో కీలకం. సోషల్ మీడియాలు, టీవీలకు దూరంగా ఉండి ఉద్యోగాలు సాధించాలి. కష్టపడి చదివి సింహ భాగం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వారు ఉద్యోగాలు సాధించుకోవాలని ఆకాంక్షిస్తున్నా." -కేటీఆర్, పురపాలక శాఖ మంత్రి
మహబూబ్ నగర్ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోందని కేటీఆర్ అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి మేరకు పట్టణానికి అవసరమైన నిధులను.. మున్సిపల్ శాఖ ద్వారా మంజూరు చేస్తామని చెప్పారు. అంతకుముందుగా తెరాస పార్టీ జెండాను ఎగురవేశారు.