టీపీసీసీ అధికార ప్రతినిధి గాల్‌రెడ్డి హర్షవర్దన్ రెడ్డి తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల పట్టభధ్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా టికెట్ ఆశించిన హర్షవర్ధన్.. పార్టీ తనకు టికెట్ కేటాయించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగుల పక్షాన ఉండి.. వారి సమస్యల పట్ల పోరాడేందుకు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటున్నట్టు వెల్లడించారు.
రెండేళ్లుగా కాంగ్రెస్‌లో ఉంటూ.. అధికార ప్రతినిధిగా అహర్నిశలు కృషి చేశానని హర్షవర్ధన్ పేర్కొన్నారు. పార్టీ పెద్దలు తనను ఉపసంహరించుకోవాలని కోరుతున్నారని తెలిపారు. పట్టభధ్రుల నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసేందుకు నిర్ణయించుకున్నానని స్పష్టం చేశారు. హైకమాండ్‌కు పంపిన జాబితాలో తన పేరు లేకున్నా.. ఉందంటూ మభ్యపెట్టడం తనను మానసికంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు.