యూరియా కోసం పడిగాపులు పడుతూ రైతులు.. ప్రమాదాల బారిన పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఆగబోయిన రాముల తండాకు చెందిన వెంకన్న తెల్లవారుజామునే 3 గంటలకల్లా యూరియా కోసం జిల్లా కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కేంద్రానికి వచ్చి క్యూలైన్లో నిలబడ్డాడు. ఇదే సమయంలో చెట్టుపైనున్న పాము వెంకన్నను కాటేసింది. ఇది గమనించిన తోటి రైతులు వెంటనే బాధితుడిని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.
అధికారులు చెబుతున్నా..
యూరియా తగినంతగా సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా... క్షేత్రస్థాయిలో మాత్రం యూరియా దొరక్క రైతులు నానా పాట్లు పడుతున్నారు. కంటి నిండా నిద్రకు కూడా దూరమవుతున్నారు. ఉదయం మూడుగంటలకల్లా నిద్ర లేచి... సరఫరా కేంద్రాల బాట పడుతున్నారు. చాంతాడంత పొడవైన క్యూలైన్లలో గంటల కొద్ది నిలబడి నీరసపడిపోతున్నారు. వ్యవసాయ పనులు వదలుకుని... రోజంతా క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని అన్నదాతలు వాపోతున్నారు. మహబూబూబాద్, వరంగల్ గ్రామీణ జిల్లాలో యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు.