తెలంగాణ

telangana

ETV Bharat / state

గంబూషియా అను నేను.... మీ జిల్లాకు వచ్చేశా.. దోమల భరతం పడతా! - Mahabubabad district news

మలేరియా, డెంగీ వ్యాధులకు కారకులవుతున్న దోమలారా.. నేను గంబూషియా చేపను.. మీ భరతం పట్టడానికి మీ మహబూబాబాద్‌ జిల్లాకు వచ్చేశాను. నన్ను మస్కిటో ఫిష్‌ అని కూడా పిలుస్తారు. మీ జిల్లా ప్రజలకు అంటువ్యాధుల ముప్పు పొంచి ఉన్నట్లు విన్నాను.

special story on  Gambusia fish in telugu
special story on Gambusia fish in telugu

By

Published : Sep 19, 2020, 4:11 PM IST

Updated : Sep 19, 2020, 5:39 PM IST

గతేడాది జిల్లా వ్యాప్తంగా 33 మలేరియా, 216 డెంగీ కేసులు నమోదైనట్లు నాకు తెలిసింది. డెంగీ నుంచి ప్రాణాలతో బయటపడేందుకు పలువురు రోగులు ఆస్పత్రుల్లో రూ.లక్షలు ఖర్చు చేసినా వారిలో కొందరు మృతి చెందారని తెలిసి చాలా బాధపడ్డాను. ఇందులో ఎక్కువగా గార్ల మండలంలోనే బాధితులున్నట్లు తెలిసింది. మీ జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం, గూడూరు, బయ్యారం, గార్ల ప్రాంతాల్లో సీజనల్‌ వ్యాధుల ముప్పు అధికంగా ఉందని నాకు ప్రాథమిక సమాచారం వచ్చింది. ఈ సారి ఇక్కడి ప్రజలకు మలేరియా, డెంగీ వ్యాధుల ముప్పు లేకుండా చేయడమే పనిగా పెట్టుకున్నాను.

300 దోమ గుడ్లను తినేస్తా..

..అన్నట్లు నేను ఎలా దోమలను అంతం చేస్తానో మీకు చెప్పనే లేదు కదా. నిల్వ నీటి గుంతలు, మురుగు నీటి కాలువల్లో నివసించే దోమలు గుడ్లను పెడుతాయనే సంగతి మీకు తెలుసుగా.. స్క్వేర్‌ మీటర్‌ కలిగిన గుంతకు మాలో ఒక చేపను వదులుతారు. మేము ఎంచక్కా 300 దోమ గుడ్లను తినేస్తాం. ఇలా గుంతల పరిమాణాన్ని బట్టి మమ్మల్ని మీ జిల్లా మత్స్యశాఖ అధికారులు వదిలిపెడుతారు. మా గంబూషియా చేపలం.. ఒకటిన్నర నుంచి రెండు ఇంచుల వరకు పెరుగుతుంటాం. ప్రతి మూడు నెలలకోసారి పిల్లలు పెడుతాం. మేము దోమల గుడ్లను, లార్వాలనే కాకుండా చిన్న చిన్న కీటకాలను కూడా తిని జీవిస్తాం.

20 వేల చేపలను వదిలేందుకు లక్ష్యం..

మీ జిల్లాలో ఉన్న నాలుగు పురపాలక సంఘాలు, 461 గ్రామ పంచాయతీల్లో నన్ను ఉపయోగించుకోవాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 20 వేల చేపలను వదలాలని లక్ష్యంగా పెట్టుకున్నారని మేము విన్నాం. మా ఉత్పత్తిని జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. ఇప్పటి వరకు 10 వేల గంబూషియా చేపలను అందుబాటులోకి తెచ్చారు. మా ఉత్పత్తిని కలెక్టర్‌, జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో మంజూరైన నిధులతో చేపట్టినట్లు విన్నాం.

మీరు కూడా భాగస్వామ్యం కావాలి..

మిమ్మల్ని రక్షించేందుకు దోమల నివారణకు ప్రభుత్వం పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టిన విషయం మీకు బాగా తెలుసు. ఈ ప్రయత్నం ఫలించి జిల్లాలో ఇప్పటి వరకు కేవలం తొమ్మిది మలేరియా, అయిదు డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు పెరగకుండా ఉండేందుకు అంటువ్యాధుల భరతం పట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి మీ సహకారం కావాలి. అసలే మాయదారి కరోనా జిల్లా అంతటినీ కమ్మేస్తోంది. ఈ నేపథ్యంలో పరిసరాల పరిశుభ్రత, ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం మీ బాధ్యతగా భావించాలి.

ఇదీ చూడండి :పంచాయతీలో అవినీతిపై దీక్ష.. భగ్నం చేసేందుకు పోలీసుల యత్నం

Last Updated : Sep 19, 2020, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details