Student Complaint On Teacher: ఎవరైనా మనకు అన్యాయం చేస్తేనో.. మనపై దాడులు చేస్తేనో.. బెదిరింపులకు పాల్పడితేనో.. వెంటనే గుర్తొచ్చేది పోలీస్టేషన్. అక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం. అయినా.. చాలా మంది పోలీస్ స్టేషన్‌కు వెళ్లేందుకు వెనకడుగువేస్తుంటారు. కానీ.. ఈ మధ్య కొందరు చిన్నారులు ఎలాంటి జంకు లేకుండా ఠాణాలకు వెళ్తున్నారు. భయం పక్కనపారేసి.. తమకొచ్చిన బాధలు చెప్పుకుని న్యాయం చేయాలని ధైర్యంగా పోలీసులను అడుగుతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో జరిగింది.
మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న అనిల్‌కు ఓ బాధొచ్చింది. తనను ఓ ఉపాధ్యాయుడు తరచూ కొడుతున్నాడు. అయితే.. ఎలాంటి తప్పు లేకుండానే ఆ ఉపాధ్యాయుడు తనను కొడుతుండటాన్ని ఆ చిన్నారి తట్టుకోలేకపోయాడు. తల్లిదండ్రులకు చెప్పినా.. ఫలితం కనిపించలేదు. తనకు పోలీసులైతేనే న్యాయం చేస్తారని ఆ చిన్నారి నిర్ధరించుకున్నాడు. వెంటనే తన తండ్రిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. నేరుగా ఎస్సై రమాదేవి దగ్గరికి వెళ్లి తన బాధ మొత్తం వెల్లగక్కాడు. తనను కొట్టే సారును అరెస్ట్ చేయాలని పట్టుబట్టాడు. పిల్లాడు చెప్పే ముచ్చట మొత్తం విన్న ఎస్సై.. కానిస్టేబుల్‌ను పురమాయించారు. పాఠశాలకు వెళ్లి ఆ సారు ఎవరు..? అసలు సంగతేంటో కనుక్కొమ్మని పంపించారు.