తెలంగాణ

telangana

ETV Bharat / state

నిధులు విడుదలైనా.. ఏడాదిగా ఎదురుచూపులే..!

ఆసిఫాబాద్‌ మండలం కౌఠగూడ గ్రామానికి చెందిన తొమ్మిది మంది మహిళలను బృందంగా ఏర్పాటు చేసి, ఆహార పదార్థాల తయారు చేసే బాధ్యతను అప్పగించారు. వీరు బ్యాంకులో రూ.4 లక్షలు పొదుపు చేయగా.. బ్యాంకు వీరికి రూ.12 లక్షల రుణం అందించింది. మరో రూ.22 లక్షలు ఐటీడీఏ అధికారులు విడుదల చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు ఆహార పదార్థాల తయారీనే ప్రారంభం కాకపోవడం వల్ల లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది.

నిధులు విడుదలైనా.. ఏడాదిగా ఎదురుచూపులే..!
నిధులు విడుదలైనా.. ఏడాదిగా ఎదురుచూపులే..!

By

Published : Aug 29, 2020, 11:35 AM IST

గిరిజన జిల్లాలో అధిక సంఖ్యలో మహిళలు రక్తహీనతతో బతుకుపోరాటం చేస్తారు. ప్రసవ సమయంలో తల్లీబిడ్డలకు రక్తం తక్కువగా ఉండడం వల్ల ప్రాణాపాయం ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఈక్రమంలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారంతో పాటు, ఇక్రిశాట్‌ ప్రత్యేకంగా తయారుచేసిన ఆహార పదార్థాలను జిల్లాలోని గర్భిణులకు అందిస్తున్నారు. వీటితో పాటు పట్టు పరిశ్రమకు కేటాయించిన స్థలంలో పోషకాహారాన్ని తయారు చేసే యూనిట్‌ను స్థాపించి, త్రుణధాన్యాలు, చిరుధాన్యాలతో మరిన్ని ఆహార పదార్థాలను ఇక్కడే తయారుచేసి అతివలకు పంపిణీ చేయాలనే సంకల్పంతో ఏడాది కిందట నిధులు విడుదలయ్యాయి. ఇప్పటికీ కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పౌష్టికాహార కేంద్రం పనులు ప్రారంభం కాలేదు.

రూ.40 లక్షల వ్యయంతో డీఆర్‌డీఏ అధికారులు ఆసిఫాబాద్‌-వాంకిడి వెళ్లే మార్గంలో పట్టు పరిశ్రమ ఉన్న స్థలంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను స్థాపించాలని సంకల్పించారు. ఈమేరకు పాత భవనాన్ని ఆధునికీకరించారు. రెండు మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించారు. జొన్నలు, రాగులు, సజ్జలు, మొక్కజొన్నల ద్వారా కిచిడీ, పల్లి పట్టీ, ఉప్మా తయారు చేసే యంత్రాలను సైతం తెప్పించారు. వీటిని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, గర్భిణులు, కిశోర యువతులకు అందించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఆసిఫాబాద్‌ మండలం కౌఠగూడ గ్రామానికి చెందిన తొమ్మిది మంది మహిళలను బృందంగా ఏర్పాటు చేసి, ఆహార పదార్థాల తయారు చేసే బాధ్యతను అప్పగించారు. వీరు బ్యాంకులో రూ.4 లక్షలు పొదుపు చేయగా.. బ్యాంకు వీరికి రూ.12 లక్షల రుణం అందించింది. మరో రూ.22 లక్షలు ఐటీడీఏ అధికారులు విడుదల చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు ఆహార పదార్థాల తయారీనే ప్రారంభం కాకపోవడంతో లబ్ధిదారులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది.

  • అంగన్‌వాడీ కేంద్రాలు: 973
  • ప్రస్తుతం ఉన్న గర్భిణులు: సుమారు 4235
  • రక్తహీనతతో బాధపడుతున్నవారు 674
  • అంగన్‌డీ కేంద్రాలకు నూనె, పాల సరఫరా రెండు నెలల నుంచి నిలిచిపోయింది.

నాలుగు మండలాలకే పరిమితమైన ఇక్రిశాట్‌ పోషకాహారం

గిరి పోషణలో భాగంగా ఐటీడీఏ అధికారులు కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని జైనూరు, సిర్పూర్‌-యు, లింగాపూర్‌, తిర్యాణి మండలాల్లోని 143 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇక్రిశాట్‌ శాస్త్రవేత్తలు రూపొందించిన చిరుధాన్యాల మిశ్రమం, పల్లి పట్టీలు, రాగి బెల్లంతో చేసిన బిస్కెట్లు, జోవర్‌ బైట్స్‌, ఎనర్జీ బార్‌, న్యూట్రీ కుక్కీస్‌ వంటి ఆరు రకాలను మహిళలకు అందిస్తున్నారు. కరోనా పరిస్థితుల వల్ల అంగన్‌వాడీ టీచర్లే బాలింతలు, గర్భిణుల ఇంటికి వెళ్లి వీటిని పంపిణీ చేస్తున్నారు. ఈ ఇక్రిశాట్‌ పోషకాహారం నాలుగు మండలాలకే పరిమితమైంది. జిల్లాలోని మిగతా ఎనిమిది మండలాల్లో సైతం రక్తహీనతతో బాధపడే మహిళలు అధికంగా ఉంటారు. ఆసిఫాబాద్‌లో ఆహార తయారీ కేంద్రంలో ఉత్పత్తి వెంటనే ప్రారంభిస్తే ప్రస్తుత కరోనా సమయంలో జిల్లా అతివలకు పౌష్టికాహార లోపం కొంతైనా తీరుతుంది.

ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న ఇక్రిశాట్‌ తయారుచేసిన ఆహార పదార్థాలు

త్వరలోనే ప్రారంభిస్తాం

ఆసిఫాబాద్‌ మండలంలో ఏర్పాటు చేస్తున్న పోషకాహార ఉత్పత్తి కేంద్రాన్ని వారం రోజుల్లో ప్రారంభిస్తాం. యంత్రాలకు సంబంధించిన పనులు కొన్ని ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, ఆహార పదార్థాల ఉత్పత్తిని ప్రారంభిస్తాం.

- వెంకటశైలేష్‌, డీఆర్‌డీఏ పీడీ

ఇదీ చూడండి:'లెక్కలేనన్ని.. మరెవరూ సాధించలేనన్ని విజయాలతో ఈటీవీ పాతికేళ్ల పండుగ'

ABOUT THE AUTHOR

...view details