రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు విపరీతంగా జరుగుతున్నాయి. జాతీయ రహదారులపైనే ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. విచక్షణ కోల్పోయి అతి వేగంతో రోడ్లపై ప్రయాణించడం, తప్పతాగి వాహనాలు నడపటం వల్ల రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఖమ్మంలో శుక్రవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. నగరంలోని చర్చి కంపౌండ్ పైవంతెన డివైడర్‌ను వేగంగా బైకు ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామానికి చెందిన శివరామకృష్ణ(22), ఉదయ్(21)గా గుర్తించారు. పోలీసులు మృతదేహాలను ఖమ్మం మార్చురీకి తరలించారు. తీవ్రంగా గాయపడిన యువకుడికి నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనతో మృతుల సొంత గ్రామం మేడేపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రహదారిపై పని చేస్తున్న కూలీలపై దూసుకొచ్చిన లారీ..జాజాతీయ రహదారి డివైడర్‌పై మొక్కలు కత్తిరిస్తున్న జీఎమ్మార్ కూలీలపైకి లారీ దూసుకొచ్చిన ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. నడిగూడెం మండలం రామాపురానికి చెందిన 8 మంది కూలీలు ట్రాక్టర్లో మొక్కలు వేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ ఆగివున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టి, కూలీలపైకి దూసుకొచ్చింది. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం వారిని ఖమ్మంనకు తరలించారు.