Ponguleti will join in Khammam Sabha : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు.. బహిరంగ సభలో ఖమ్మం మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరతారని ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జి మాణిక్ రావు ఠాక్రే స్పష్టం చేశారు. పాదయాత్ర ముగింపు సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఘనంగా సన్మానించనున్నారని.. ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. బుధవారం కోదాడ నియోజకవర్గం మామిల్లగూడెం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర శిబిరం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఏఐసీసీ నిర్దేశించిన మార్గదర్శకం మేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేశారని మాణిక్రావు ఠాక్రే అన్నారు. భట్టి చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని వివరించారు. కాంగ్రెస్ భావజాలాన్ని అన్ని వర్గాల్లోకి పాదయాత్ర ద్వారా తీసుకువెళ్లడంలో భట్టి సఫలీకృతమయ్యారని తెలిపారు. మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం గ్రామం నుంచి మొదలైన పాదయాత్ర 105 రోజుల్లో 36 నియోజకవర్గాలు, 600 గ్రామాలకు పైగా చుట్టేసి 1221 కిలోమీటర్లు పూర్తి చేసుకుందని వివరించారు.
"జులై 2 న ఖమ్మంలో నిర్వహించే తెలంగాణ జనగర్జన సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ కాంగ్రెస్లో చేరతారు. అదే సభలో భట్టి విక్రమార్క పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఆయనను రాహుల్ గాంధీ సన్మానిస్తారు. లక్షమందితో ఈ భారీ బహిరంగ సభ జరగనుంది."- మాణిక్ రావు ఠాక్రే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జి