ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో తెరాసలో అంతర్గత ఘర్షణలు తారస్థాయికి చేరాయి. నాలుగు మండలాల్లో పలు పోలీసు స్టేషన్లలో ఒక వర్గంపై మరో వర్గం కేసులు నమోదు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్గానికి, ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి వర్గానికి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్‌కు తుమ్మల వర్గీయులు సోమవారం ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి తమ వర్గం నాయకులపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. తమ కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతున్నారని సీపీకి విన్నవించారు.
కూసుమంచి పోలీస్ స్టేషన్ ఎదుట ఇటీవల ఇరువర్గాల నాయకులు బాహాబాహీకి దిగటం గమనార్హం. కాంగ్రెస్ నుంచి తెరాసలోకి వచ్చిన ఎమ్మెల్యే నిజమైన తెరాస కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు. తెరాసలో ఉండి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎమ్మెల్యే పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.