Khammam BRS Public Meeting: ఖమ్మం గడ్డపై నిర్వహించతలపెట్టిన భారీ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు బీఆర్‌ఎస్ జోరుగా సన్నాహాలు చేస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి భారీగా జనసమీకరణే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తోంది. ఆర్థికమంత్రి హరీశ్ రావు, జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో సభకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 18న నిర్వహించే సభను విజయవంతం చేసేందుకు బీఆర్‌ఎస్ ప్రణాళికలు రచిస్తోంది.
బహిరంగ సభ ఏర్పాట్లకు మంత్రి హరీశ్ రావు నేతృత్వం వహించనున్నారు. బహిరంగ సభ ఇంఛార్జిలుగా మంత్రులు ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావును నియమించారు. బహిరంగ సభా వేదిక ఇంఛార్జిగా టీఎస్ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లుకు బాధ్యతలు అప్పగించారు.
భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ముఖ్య అతిథులుగా దిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్‌తోపాటు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా హాజరుకానున్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, ఇతర నేతల కోసం ప్రత్యేకంగా 2 హెలికాప్టర్లను బీఆర్‌ఎస్ ఏర్పాటు చేస్తోంది. దిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు 17న రాత్రికే హైదరాబాద్ చేరుకుంటారు.18న ఉదయం కేసీఆర్‌తోపాటు ముఖ్యమంత్రులు, పలువురు నేతలు రెండు హెలికాప్టర్లలో యాదాద్రికి వెళ్లనున్నారు. అక్కడ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. జాతీయ రాజకీయాల్లో సత్తా చాటడమే లక్ష్యంగా తొలి బహిరంగ సభ నిర్వహిస్తున్న సందర్భంగా యాదాద్రిలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.
ముఖ్యనేతలు హాజరు: అనంతరం అక్కడి నుంచి మధ్యాహ్నం సమయంలో హెలికాప్టర్లలో ఖమ్మం చేరుకుంటారు. 18న ఉదయం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విజయవాడ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖమ్మం రానున్నారు. అనంతరం అందరూ కలిసి కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. అక్కడే ఖమ్మం జిల్లాకు నూతనంగా కేటాయించిన వైద్యకళాశాల నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం కలెక్టరేట్‌ను పరిశీలిస్తారు. తర్వాత రెండోదశ కంటివెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం నూతన కలెక్టరేట్ కార్యాలయంలోనే ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్యనేతలు భోజనం చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2.30 గంటలకు భారీ బహిరంగ సభకు హాజరవుతారు. ముగ్గురు సీఎంలు, యూపీ మాజీ సీఎం, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా ఒకేసారి వేదికపైకి చేరుకుంటారు. ముఖ్యనేతల ప్రసంగం తర్వాత చివరగా సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. జాతీయ రాజకీయాలపై మాట్లాడటంతోపాటు బీఆర్‌ఎస్ ఉద్దేశం, లక్ష్యాలు వివరిస్తారు.