జమ్మికుంట పోలీస్‌స్టేషన్‌లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు అక్కడి సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తుంటారు. ఠాణాలోకి అడుగుపెట్టడంతోనే చెట్లు, పూలమొక్కలు సాదరంగా ఆహ్వానం పలుకుతాయి. ఒకవైపు పచ్చని పూలచెట్లు, మరోవైపు చిన్నారులు ఆడుకొనే ఆటవస్తువులు. పిల్లల కోసం ప్రత్యేక పార్కు కనిపిస్తుంది. దివ్యాంగులు నేరుగా మెట్లు ఎక్కలేరనే ఉద్దేశంతో ప్రత్యేక కుర్చీని ర్యాంపును కూడా ఏర్పాటు చేశారు. ఠాణాలోకి వెళ్లినట్లు కాకుండా బంధువుల ఇంటికి వెళ్లామనే అనుభూతి కలుగుతుంది.
జాతీయస్థాయిలో ర్యాంక్...
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 16,671 పోలీస్ స్టేషన్లలో 10 ఉత్తమ పోలీస్‌స్టేషన్లను ఎంపిక చేయగా జమ్మికుంట పీఎస్ 10వ స్థానాన్ని దక్కించుకుంది. 2017 ఆగస్ట్ నెలలో మోడల్ ఠాణాగా ఎంపిక చేశారు. స్టేషన్‌కు అన్ని మౌలిక వసతులు కల్పించారు. 100 శాతం సీసీ కెమెరాలు... పట్టణంతో పాటు స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో 100 శాతం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే విధంగా పోలీసులు... గ్రామస్థులను ప్రోత్సహించారు.
భేష్...
ఠాణా నిర్వహణను సమర్థంగా కొనసాగిస్తూ ప్రజలతో భేష్ అనిపించుకుంటున్నారు. ప్రజలతో మర్యాదగా మాట్లాడుతూ వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించడం, చట్ట పరిధిలో వాటిని పరిశీలించడం ఇక్కడి పోలీసుల ప్రత్యేకత. ఫిర్యాదుదారులు నిరక్షరాస్యులైనా వారి ఆర్జీలు రాయడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించారు.