తెలంగాణ

telangana

ETV Bharat / state

Huzurabad constituency Voters 2021 : అంతుచిక్కని ఓటరు ఆంతర్యం.. అంతర్మథనంలో అభ్యర్థులు

ఓటింగ్‌ తేదీ సమీపిస్తున్నకొద్దీ.. హుజూరాబాద్‌ ఉప ఎన్నికల రాజకీయం అనూహ్యంగా ఊపందుకుంటోంది. మూడు పార్టీల అభ్యర్థులు, వారి అనుచరగణం, శ్రేణులు విజయం కోసం చెమటోడుస్తున్నాయి. పోటాపోటీగా ప్రచారాల తీరుతో ఓటరు(Huzurabad constituency Voters) మహాశయుల్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటున్నారు. ఎవరికి వారుగా ప్రచార కార్యక్రమాలకు పార్టీ శ్రేణులతోపాటు జనం హాజరవుతున్న తీరుకి లోలోపల మురిసిపోతున్నా.. అసలు ఆవేదనంతా అసలు ఓటర్ల మద్దతు ఎటువైపు అనే దిగాలు మాత్రం వెంటాడుతోంది.

Huzurabad constituency Voters 2021
Huzurabad constituency Voters 2021

By

Published : Oct 25, 2021, 10:25 AM IST

హుజూరాబాద్​ ఉపఎన్నిక పోరు రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఓటర్ల(Huzurabad constituency Voters)ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు శాయశక్తులా కృషి చేస్తున్నా... వారి ఆంతర్యమేంటో ఎవరికీ అంతుపట్టడం లేదు. ముఖ్యంగా గతానికి భిన్నంగా ఈ ఉప ఎన్నికల్లో ఓటరు ‘నాడీ’ అంత సులువుగా ఎవరికీ అందడంలేదు. ఆయా పార్టీల ముఖ్యులు రాజకీయ విశ్లేషకులకు కూడా అంతుచిక్కడంలేదు. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనుండటంతో ఉన్న ఈ కాస్త సమయంలోనైనా ఓటరును తమవైపునకు తిప్పుకునేలా జోరును ప్రధాన పార్టీలు పెంచుతున్నాయి.

ఊహకందని తీరులో..

ఉప ఎన్నికలు ఇక్కడి నియోజకవర్గంలో అనివార్యమని తెలిసినప్పట నుంచి ఇక్కడి ఓటర్ల(Huzurabad constituency Voters)పై ఆయా పార్టీలు కన్నేశాయి. మే నెలాకరు నుంచి దాదాపుగా అయిదు నెలల వ్యవధి నుంచి ఇక్కడ పోరుబాటను తమదైన తరహాలో ఆయా పార్టీలు కొనసాగిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడక ముందే హోరాహోరీ ప్రచారాలతో ఆకట్టుకునే ప్రయత్నాల్ని చేశారు. సుదీర్ఘ రాజకీయ ప్రచారాలకు ఇక్కడి గ్రామాల్ని, పట్టణాల్ని వేదికగా మలిచారు. పోటాపోటీగా హామీలను గుప్పిండంతోపాటు ఆయా పార్టీల నాయకులను తమవైపునకు తిప్పుకొనేలా వలసలకు ఆయా పార్టీలు ప్రోత్సహించాయి. దీంతో ఇక్కడి రాజకీయంలో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్నాయి. మునుపెన్నడు లేనివిధంగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఆయా పార్టీల ముఖ్యనేతల కండువాలు మారాయి. అనుచరగణం విషయంలో అటునుంచి ఇటు ఇటునుంచి అటు అనే పరిస్థితులు నెలకొన్నాయి. వీటన్నింటినీ స్వయంగా పరిశీలించిన ఓటరు మాత్రం తన పంథా ఎటువైపు అనేది ఇన్నాళ్లుగా స్పష్టంగా చెప్పడంలేదు. రాజకీయ నాయకుల ఎత్తుగడలకు అంతుచిక్కకుండా తమ అంతరంగాన్ని దాచేపనిలో ఉన్నారు. ఎవరడిగినా.. మీకే మా ఓటనేలా తెలివిగా వ్యవహరిస్తున్నారు.

"ఓటర్లు(Huzurabad constituency Voters) ఎటువైపు ఉన్నారంటే.. ఏం చెప్పాలె.. అన్న.! ఏ పార్టీ ప్రచారాలకైనా తండోపతండాలుగా జనాలొస్తున్నరు. ఎవరిని అడిగినా మీకే ఓటంటున్నరు. ఏమి సమజైతలేదు. హుజూరాబాద్‌లో ఓటరు నాడీ అంతుచిక్కడంలేదు".

- ప్రధాన పార్టీకి చెందిన ఓ నాయకుడి మాట.

"ఓటు ఎటు వేసేది.. ఇప్పుడే ఎట్ల చెప్తం. ఇంకా సమయముంది కదా..! అప్పటి వరకు ఆలోచిస్తం. వీళ్లు చెప్పే మాటలు.. వాళ్లు చెప్పే మాటలు వింటున్నాం. ఓటేసే సమయానికి మా మనసుకు ఓలు నచ్చితే వాళ్లకే ఓటేస్తాం.!"

- హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ఓటరు(Huzurabad constituency Voters) అంతరంగమిలా..

ABOUT THE AUTHOR

...view details