కామారెడ్డి జిల్లాలో వేటకు వెళ్లి బండరాళ్ల మధ్య తలకిందులుగా ఇరుక్కుపోయిన వ్యక్తిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామానికి చెందిన షాడ రాజు రాళ్లపై నుంచి వెళ్తుండగా సెల్‌ఫోన్ పడిపోయింది. దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తూ తలకిందులుగా రాళ్ల మధ్యలోకి జారి ఇరుక్కుపోయాడు. మంగళవారం సాయంత్రం ఇరుక్కుపోగా.. బుధవారం నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వేటకెళ్లి.. బండరాళ్లలో తలకిందులుగా చిక్కుకొని.. ఉదయం నుంచి రెండు జేసీబీలు, ఇతర యంత్రాల సాయంతో బండరాళ్లను తొలగిస్తున్నారు. 40 గంటలకు పైగా తలకిందులు గానే ఉండిపోవడంతో రాజు నరకయాతన అనుభవిస్తున్నాడు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, అదనపు ఎస్పీ అన్యోన్య, ఇన్‌ఛార్జి తహసీల్దార్ సాయిలు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రాజును రక్షించేందుకు పోలీసు, అటవీ, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
అసలేం జరిగిదంటే: షాడ రాజు మంగళవారం సాయంత్రం మిత్రుడు మహేశ్‌తో కలిసి ఘన్‌పూర్ శివారు అడవిలో వేటకు వెళ్లాడు. రాళ్లపై నుంచి వెళ్తుండగా సెల్‌ఫోన్ పడిపోయింది. దాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తూ తలకిందులుగా రాళ్ల మధ్యలోకి జారి ఇరుక్కుపోయాడు. వెంట వచ్చిన మిత్రుడు బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కాళ్లు, ఒక చేయి మాత్రమే బయటకు కనిపించాయి. వేటకు వెళ్లిన కారణంగా అధికారులకు సమాచారం ఇవ్వకుండా కుటుంబసభ్యులు, మిత్రులు బుధవారం మధ్యాహ్నం వరకు బయటకు తీసేందుకు శ్రమించారు. వీలుకాదని తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. రాజుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
ఇవీ చదవండి:కిలోమీటర్ @221 గుంతలు.. ఎక్కడో కాదండోయ్..!
నగలు తాకట్టుపెట్టి ఊరికి ఉపకారం.. సొంతంగా వంతెన, రోడ్డు నిర్మించిన తండ్రీకొడుకులు