జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో చేనేత కార్మికులకు కష్టాలు తప్పడం లేదు. ఉదయం నుంచి రెక్కలు ముక్కలు చేసుకొని మరమగ్గం, చేనేత మగ్గాలతో కుస్తీ పట్టినా రోజుకు 250 రూపాయలు కూడా కూలి పడడం లేదు. పెట్టుబడి సదుపాయాలు అందుబాటులో ఉండకపోవడం వల్ల చేనేత కార్మికులు దుర్భర పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి కనీస సౌకర్యాలు అందక ఇబ్బందులకు గురవుతున్నారు. తయారుచేసిన వస్త్రాలకు సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేక వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మార్కెటింగ్ లేక అవస్థలు
చేనేత కార్మికులు సాధారణ చీర అయితే రోజుకు ఒకటి చొప్పున నేస్తారు. నెలకు పదివేల రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితుల్లో ఉన్నారు. సహకార సభ్యులు నేసిన చీరలను టెస్కో కొనుగోలు చేస్తుంది. సంఘాలు లేని కార్మికులు నేసిన చీరలను కూడా టెస్కో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నా కార్యరూపం దాల్చడంలేదు. అమ్ముకోడానికి సరైన మార్కెటింగ్ లేక గద్వాల, హైదరాబాద్, ముంబయి తదితర ప్రాంతాలకు వెళ్లి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు.