మేడారం జాతర ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉన్నతాధికారులతో సమీక్షించారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతరకు కోటికిపైగా భక్తులు వస్తారని, ప్రతి శాఖ.. తమకు కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకొని భక్తులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
మాస్టర్ ప్లాన్
వచ్చే 10 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకొని మాస్టర్ ప్లాన్ రూపొందించి సౌకర్యాలను మెరుగుపరచాలన్నారు. జాతరలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంతోపాటు పర్యావరణహితంగా అడవులకు ఎటువంటి నష్టం కలగకుండా చూడాలన్నారు. జాతర ఏర్పాట్ల కోసం భూసేకరణకు సంబంధించి భూములు ఇచ్చేవారికి స్వయం ఉపాధి కల్పించి.. ఎంటర్ప్రెన్యుర్షిప్ అభివృద్ధి చేసేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎస్ వివరించారు.