తెలంగాణ

telangana

ETV Bharat / state

మోగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా - elections

గ్రామాల్లో మళ్లీ ఎన్నికల సందడి మొదలు కానుంది. పరిషత్ పోరుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. మూడు దశల్లో ఎన్నికలు జరపనున్నారు. అన్ని స్థానాల లెక్కింపు మే 27న చేపట్టనున్నారు. లక్షా 47 వేల మంది పోలింగ్​ సిబ్బంది, 26 వేల మంది పోలీసులు విధుల్లో  పాల్గొననున్నారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ

By

Published : Apr 21, 2019, 7:09 AM IST

Updated : Apr 21, 2019, 11:07 AM IST

మండల, జిల్లా పరిషత్​ ఎన్నికల నగారా మోగింది. 538 జడ్పీటీసీ, 5817 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది. వచ్చే నెల 6, 10, 14న నాలుగు రోజుల విరామంతో పోలింగ్​ జరపనున్నారు. మే 27న ఒకేరోజు అన్ని స్థానాల ఓట్ల లెక్కింపు చేపడతారు. మొదటి విడతకు ఈ నెల 22న, రెండో విడతకు 26, మూడో విడతకు 30న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

మోగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా


పదవీ కాలం పూర్తికాలేదు

రాష్ట్రంలో మొత్తం 539 జడ్పీటీసీ స్థానాలు ఉండగా... న్యాయస్థానంలో వ్యాజ్యం ఉన్నందున ములుగు జిల్లా మంగపేట జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరగడం లేదు. 5857 ఎంపీటీసీ స్థానాలకు గాను జడ్చర్లలో 15, బూర్గంపాడు, భద్రాచలం మండలంలో 11 ఎంపీటీసీల స్థానాల పదవీకాలం ఇంకా పూర్తి కాలేదు. న్యాయస్థానంలో వ్యాజ్యం కారణంగా మంగపేట పరిధిలోని 14 ఎంపీటీసీ స్థానాలకు కూడా ఎన్నికలు వాయిదా వేశారు.

ఓటర్లు పెరిగే అవకాశం

ఇప్పటికే ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో గ్రామీణ ఓటర్ల జాబితా కోటి 56 లక్షల 11వేల 474 ఉండగా నేడో, రేపో ప్రకటించే తుది జాబితాతో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇందుకోసం 32 జిల్లాల్లో 32 వేల 42 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల కోసం 15 మంది సాధారణ, 37 మంది వ్యయ పరిశీలకులను నియమించారు.

మేడ్చల్​లో మొదటి దశలోనే

మొదటి విడతలో 197 జడ్పీటీసీ, 2166 ఎంపీటీసీ స్థానాలకు, రెండో విడతలో 180 జడ్పీటీసీ, 1913 ఎంపీటీసీ స్థానాలకు, మూడో దశలో 161 జడ్పీటీసీ, 1738 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లాలో 5 జడ్పీటీసీ, 42 ఎంపీటీసీ స్థానాలు మాత్రమే ఉన్నందున... మొదటి దశలోనే పూర్తి చేయనున్నారు. పది జిల్లాలో రెండు విడతలు, మిగతా 21 జిల్లాల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఆన్​లైన్​లోనూ

గరిష్ఠ వ్యయపరిమితి జడ్పీటీసీకి నాలుగు లక్షలు, ఎంపీటీసీకి లక్షన్నరగా ఖరారు చేశారు. ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా ఉన్న వారూ స్థానిక ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఒకే అభ్యర్థి ఎంపీటీసీ, జడ్పీటీసీ రెండు స్థానాలకు ఏకకాలంలో పోటీ చేయవచ్చు. కానీ రెండు ఎంపీటీసీ లేదా రెండు జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేయకూడదు. అభ్యర్థులు ఆన్ లైన్​లోనూ నామినేషన్లను వేయవచ్చు. దాని ముద్రిత కాపీ కచ్చితంగా రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. నోటిఫికేషన్ విడుదలైనందున 32 జిల్లాల్లో ఎన్నికలు జరిగే అన్ని చోట్ల ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది.

ఇవీ చూడండి: ఘనంగా హైకోర్టు భవనం శతాబ్ది ఉత్సవాలు

Last Updated : Apr 21, 2019, 11:07 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details