తెలంగాణ

telangana

By

Published : Jun 6, 2021, 11:40 AM IST

ETV Bharat / state

స్వచ్ఛంద సంస్థల సేవా స్ఫూర్తి.. కొవిడ్‌ బాధితులకు ఆపన్నహస్తం

కొవిడ్‌ ప్రతి ఒక్కరిని కష్టాల్లోకి నెడుతోంది. ఆర్థికంగా స్తోమత ఉన్నవాళ్లైతే కొంతమేర తట్టుకోగలుగుతున్నారు. ప్రతిరోజూ పని చేస్తేనే పూటగడిచే నిరుపేదల పరిస్థితి దారుణంగా ఉంటోంది. ఈ తరుణంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. వైరస్‌ నిర్ధరణ పరీక్షల నుంచి మొదలు.. అంబులెన్స్‌లు, ఆహారం ఇలా అన్ని రకాలుగా సాయం చేస్తూ.. బాసటగా నిలుస్తున్నాయి.

స్వచ్ఛంద సంస్థల సేవా స్ఫూర్తి.. కొవిడ్‌ బాధితులకు ఆపన్నహస్తం
స్వచ్ఛంద సంస్థల సేవా స్ఫూర్తి.. కొవిడ్‌ బాధితులకు ఆపన్నహస్తం

స్వచ్ఛంద సంస్థల సేవా స్ఫూర్తి.. కొవిడ్‌ బాధితులకు ఆపన్నహస్తం

హైదరాబాద్‌లో ముషీరాబాద్, గాంధీనగర్, కవాడిగూడ, బోలక్‌పూర్‌ డివిజన్లలోని బస్తీల్లో అనేక మంది పేదలు జీవనం సాగిస్తుంటారు. రోజూ పనిచేస్తేనే పూటగడిచే వీరికి.. కరోనా వస్తే జీవితాలు దయనీయంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మేమున్నామంటూ అండగా నిలుస్తోంది.. అమన్ వేదిక-రెయిన్‌ బో ఫౌండేషన్. నిరుపేదలు నివసించే బస్తీలను ఎంచుకుని సేవా కార్యక్రమాలు చేపడుతోంది. కరోనా బారిన పడిన ఒక్కో కుటుంబానికి రూ.3 వేల విలువ చేసే నిత్యావసరాలు అందిస్తోంది. ఆసుపత్రులకు తరలించేందుకు ఉచిత అంబులెన్స్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. అవసరమైతే ఇంటివద్దకే వెళ్లి ఆక్సిజన్‌ను అందిస్తోంది. వారు అందించిన అండతో అనేక మంది కొవిడ్‌ను జయించారు. అన్ని రకాలుగా అండగా నిలిచారంటూ బాధితులు కృతజ్ఞతలు చెబుతున్నారు.

ప్రాథమిక వైద్య కేంద్రాల్లో పాజిటివ్‌ సోకిందని నిర్ధరణ కాగానే.. అమన్ వేదిక-రేయిన్‌ బో ఫౌండేషన్ ప్రతినిధులు వారి పేరు, చిరునామా, ఫోన్ నంబర్ సేకరిస్తారు. మరుసటి రోజు వారికి వైద్యం, ఆహారంతో కూడిన కిట్‌ అందించి.. ప్రతి రోజూ ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు.

అదే తరహాలో మరో స్వచ్ఛంద సంస్థ..

భారత గ్రామ నవ నిర్మాణ సంస్థ-మారీ అనే మరో స్వచ్ఛంద సంస్థ అదే తరహాలో నిరుపేదలైన కరోనా బాధితులకు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. 11 రకాల పోషక విలువలున్న నిత్యావసర సామగ్రితో పాటు ఎన్-95 మాస్కులు, శానిటైజర్లు, గ్లౌవ్స్‌, సబ్బులు, ఆవిరిపట్టే పరికరాన్ని అందిస్తోంది. మారీ సంస్థ ప్రతినిధులు సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసుకొని అక్కడికి వచ్చిన వారికి సేవలు అందిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులను గాంధీ, నిమ్స్, టిమ్స్ వంటి ఆసుపత్రులకు తరలిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

కొవిడ్‌ వస్తే ఆందోళన చెందకుండా ఉండేందుకు రెండు ఆటోలతో ముషీరాబాద్ నియోజకవర్గంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నిత్యం ప్రచారం నిర్వహిస్తున్నారు. అమన్ వేదిక, రెయిన్ బో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 80 కుటుంబాలకు రూ.3 వేల విలువైన నిత్యావసరాలు అందించింది. మారీ సంస్థ ముషీరాబాద్ యూపీహెచ్‌సీ పరిధిలోనే సుమారు 30 మందికి కిట్లను అందజేసినట్లు పేర్కొన్నారు. మరో 9 కేంద్రాల్లో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది.

ఇదీ చూడండి: Drugs : శంషాబాద్​లో రూ.53 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత

ABOUT THE AUTHOR

...view details