తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్లపై ఆర్టీసీ పరుగులు...ఎక్కడ ఎలా ఉందంటే?

రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. 56 రోజులుగా డిపోలకే పరిమితమైన బస్సులు... లాక్​డౌన్​ సడలింపులతో మళ్లీ రోడ్డెక్కాయి. ఉదయం నుంచి ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది బస్టాండ్​లకు చేరుకోవడం వల్ల సందడి వాతావరణం నెలకొంది. డ్రైవర్లు, కండక్టర్లు మాస్కులు ధరించి.. శానిటైజర్​తో చేతులు శుభ్రపరుచుకున్నాకే బస్సులను బయటకి తీశారు. అటు బస్సుల్లోనూ.. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు.

TSRTC BUSES STARTED IN TELANGANA STATE OVER ALL
రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన ప్రజారవాణా...ఎక్కడ ఎలా ఉందంటే?

By

Published : May 19, 2020, 4:19 PM IST

రాష్ట్రవ్యాప్తంగా తొలిరోజు ప్రయాణీకుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల ఆర్టీసీ పరిమితంగా బస్సులను నడిపింది. కరోనా భయం కారణంగా బస్టాండులు ప్రయాణీకులు లేక బోసిపోయాయి. దీనితో వివిధ జిల్లాలకు బయల్దేరిన బస్సులన్నీ దాదాపుగా ఖాళీగా దర్శనమిచ్చాయి.

అంతర రాష్ట్ర రూట్లలోనూ...

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 9 డిపోల నుంచి 761 బస్సు సర్వీసులు ప్రారంభం కాగా... ఆ జిల్లా నుంచి హైదారాబాద్‌కు వచ్చే బస్సులను ఆరాంఘార్‌ చౌరస్తా వరకే అనుమతిచ్చారు. అంతర రాష్ట్ర రూట్లలో రాష్ట్ర సరిహద్దు చివరి బస్టాండ్‌ వరకు బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు.

కదిలిన చక్రాలు

వికారాబాద్‌ జిల్లా పరిగి నుంచి వచ్చే బస్సులు... హైదరాబాద్ అప్పా జంక్షన్ వరకు రానున్నాయి. ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ప్రారంభమైన బస్సు సర్వీసులను.. జేబీఎస్​ వరకు అనుమతిచ్చారు. నల్గొండ, సూర్యాపేట డిపో నుంచి రాజధానికి బయల్దేరే బస్సులు హయత్‌నగర్‌ వరకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సులు వాడపల్లి వరకు నడుపుతున్నారు. వరంగల్ నుంచి ప్రారంభమయ్యే బస్సులను ఉప్పల్ చౌరాస్తా వరకే నడుపుతున్నట్లు వెల్లడించారు.

ఆర్టీసీ సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు

ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ సిబ్బందికి అధికారులు మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఆర్టీసీ డిపో నుంచి ఉదయం ఆరు గంటలకే ప్రయాణికులతో ఇతర ప్రాంతాలకు బస్సులు తరలివెళ్లాయి. వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలకు బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. జగిత్యాల, కోరుట్ల, మెట్​పల్లి డిపోలు ఉండగా మూడు డిపోల్లో బస్సులు నడుపుతున్నారు.

సాయంత్రం 7లోపు రావాల్సిందే..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బస్సులను హైపోక్లోరైడ్ ద్రావణంతో శుభ్రంచేశారు. కోదాడ డిపోలో ఉద్యోగులకు మాస్కులు, శానిటేషన్లను అందించారు. భువనగిరిలో బస్సులు బయటికి రావడంతో పట్ల ఆర్టీసీ ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. ఉప్పల్ డిపో నుంచి వైద్య, ఆరోగ్య సిబ్బంది కోసం 7 బస్సులను బయటికి పంపించారు. మహబూబాబాద్​లోని ఆర్టీసీ బస్ డిపోలో అన్ని బస్సులను శుభ్రం చేసిన అధికారులు.... సాయంత్రం 7 గంటలలోపు బస్సులు తిరిగి బస్ డిపోకు చేరుకునే విధంగా ఏర్పాట్లు చేశారు.

ఇవీ చూడండి:'బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం'

ABOUT THE AUTHOR

...view details