సైబర్ ఆధారిత నేర పరిశోధనలో పోలీసు అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను ఛేదించడంలో ప్రతి పోలీసు స్టేషన్‌లోని అధికారులకు ప్రత్యేక శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. నేర పరిశోధన శాఖ, మహిళా భద్రతా విభాగం, రాష్ట్ర ఐటీ సెల్ ఆధ్వర్యంలో మహిళలు, పిల్లలపై జరిగే నేరాల పరిశోధనపై శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 117 మంది పోలీసులకు మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రారంభ సమావేశంలో డీజీపీ వెబినార్ ద్వారా ప్రసంగించారు.
అవే కీలకం..
గతంలో ఇందులో శిక్షణ ఇచ్చిన అధికారులను సైబర్ వారియర్లుగా నియమించామని డీజీపీ తెలిపారు. మహిళలు, పిల్లలపై నేరాలు చేయడంలో నేరస్థులు అవలంబించిన పద్ధతులు, డిజిటల్ ఎవిడెన్స్ నేర పరిశోధనలో కీలకమని అన్నారు. సైబర్ క్రైమ్ టూల్స్లోనూ ప్రావీణ్యత సంపాదించడం ద్వారా విధినిర్వహణలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. అంతే కాకుండా షీ- టీమ్‌లకు వచ్చే ఫిర్యాదులనూ పర్యవేక్షిస్తారని తెలిపారు. ఈ వెబినార్ సమావేశంలో అడిషనల్ డీజీపీ స్వాతిలక్రా, ఐజీ సుమతి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:నాగార్జునసాగర్‌లో ముగిసిన ఎన్నికల ప్రచారం