రాష్ట్రంలో నాలుగింట ఒకరిలో కొవిడ్ వైరస్‌ను నియంత్రించే యాంటీబాడీస్ (ప్రతిరక్షకాలు) అభివృద్ధి చెందాయని ఐసీఎంఆర్-ఎన్‌ఐఎన్ (భారత వైద్య పరిశోధన మండలి- జాతీయ పోషకాహార సంస్థ) సర్వే వెల్లడించింది. జనగామ, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో గత డిసెంబరులో నిర్వహించిన సర్వేలో మొత్తం 24.1 శాతం మందిలో కరోనా యాంటీబాడీస్ వృద్ధి చెందినట్లు వెల్లడైందని ఎన్‌ఐఎన్ పేర్కొంది. జాతీయస్థాయిలో ఈ వృద్ధి 24 శాతంగా ఉందని తెలిపింది. తెలంగాణలో కరోనా ఉద్ధృతి తక్కువగా ఉన్నప్పటికీ.. యాంటీబాడీస్ వృద్ధి రేటు బాగుందని వెల్లడించింది. కంటెయిన్‌మెంట్ జోన్లుగా ప్రకటించి.. వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకున్న జాగ్రత్తలు, పరీక్షలతో ఇది సాధ్యమైందని ఎన్‌ఐఎన్ డైరెక్టర్ డా.హేమలత తెలిపారు.
పావువంతు మందిలో యాంటీబాడీలు
తెలంగాణలో పావువంతు మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు ఐసీఎంఆర్-ఎన్‌ఐఎన్ సర్వే వెల్లడించింది. గత డిసెంబరులో జనగామ, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో సీరో సర్వే నిర్వహించగా... 75% మందిలో కరోనా ముప్పు ఉన్నట్లు పేర్కొంది.
తగిన జాగ్రత్తల నేపథ్యంలో కరోనా మహమ్మారి విజృంభణ తెలంగాణలో నెమ్మదించినా.. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ 75 శాతం మందికి కరోనా ముప్పు పొంచి ఉన్నట్లు తమ సర్వేల ద్వారా వెల్లడైందని ఈ సర్వేకు నోడల్ అధికారిగా ఉన్న డా.ఎ.లక్ష్మయ్య హెచ్చరించారు. ‘‘కరోనా వచ్చినా.. ఆ లక్షణాలు బయటపడకుండానే తగ్గిపోయిన వారు ఉన్నారు. వ్యాధి నిరోధకశక్తి ఎక్కువగా ఉండడం వల్ల వారిలో ప్రభావం చూపలేదనేది కొందరిని పరీక్షించిన తర్వాత వెల్లడైంది.తప్పనిసరిగా మాస్కు ధరించడం, వ్యక్తిగత దూరాన్ని పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి’’ అని డా.లక్ష్మయ్య సూచించారు.