New zonal system in telangana: ఉద్యోగులకు నష్టం జరగకుండా విభజన, బదిలీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగ సంఘాలు కోరాయి. హైదరాబాద్ బీఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో సమావేశమైన టీజీవో, టీఎన్జీవో ప్రతినిధులు ఉద్యోగుల వర్గీకరణ, బదిలీల విధివిధానాలపై చర్చించారు. ఉద్యోగుల విభజనను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్ తెలిపారు. ఉద్యోగుల విభజన విషయమై సీఎస్ తమ వద్ద సూచనలు, సలహాలు తీసుకున్నారని రాజేందర్ పేర్కొన్నారు. ఏ జిల్లా ఉద్యోగిని ఆ జిల్లాలోనే సర్దుబాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన వెల్లడించారు. దంపతులు, ఆరోగ్య సమస్యలున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని.. ఎస్సీ, ఎస్టీలకు రోస్టర్ విధానం పాటించాలని విజ్ఞప్తి చేసినట్లు వివరించారు.
కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల వర్గీకరణపై చర్చ 'ఉద్యోగుల విభజన త్వరగా పూర్తి చేసి.. ఏ జిల్లా ఉద్యోగిని ఆ జిల్లాలోనే సర్దుబాటు చేయాలని సీఎస్‌ను కోరాం. దంపతులు, ఆరోగ్య సమస్యలున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ కులాల వారికీ రోస్టర్ విధానం పాటించాలని ప్రభుత్వానికి విన్నవించాం.' -రాజేందర్, టీఎన్జీవో అధ్యక్షుడు
TNGO and TGO met CS: కొత్త జోనల్ విధానం ద్వారా ఉద్యోగులకు నష్టం జరగకుండా విభజన చేయాలని సీఎస్‌ను కోరినట్లు టీజీవో అధ్యక్షురాలు మమత వెల్లడించారు. సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తూ ఉద్యోగుల కేటాయింపు చేయాలని కోరినట్లు చెప్పారు. ఉద్యోగుల బదిలీల కోసం ఆయా జిల్లాల్లో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నెలలోనే బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుందని.. ప్రక్రియ అంతా ఆన్‌లైన్ విధానంలో ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు బాగున్నాయని మమత వెల్లడించారు. ఉద్యోగాల నోటిఫికేషన్‌పై త్వరలో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నట్లు వివరించారు.
'సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తూ ఉద్యోగుల కేటాయింపు చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. ఉద్యోగుల ప్రత్యేక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం. ప్రభుత్వం రూపొందించిన గైడ్‌లైన్స్ బాగున్నాయి. క్లిష్టమైన సమస్యను సీఎం సులభంగా పరిష్కరించారు. ఉద్యోగాల నోటిఫికేషన్‌పై త్వరలో సీఎం సమావేశం కానున్నారు.' -మమత, టీజీవో అధ్యక్షురాలు
ఇదీ చదవండి:venkaiah naidu news: 'ప్రజాస్వామ్యాన్ని అవినీతి నాశనం చేస్తోంది'