TRS MPs walkout from Lok Sabha: యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలంటూ లోక్‌సభలో ఆందోళన చేపట్టిన తెరాస... కేంద్రం తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేసింది. జాతీయ ధాన్యం సేకరణ విధానం, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేసింది. లోక్‌సభ ప్రశ్నోత్తరాలు ప్రారంభమైన వెంటనే తెరాస ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. యాసంగిలో ధాన్యం సేకరణపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ.... నినాదాలు చేశారు. ఈ అంశంపై చర్చించాలంటూ నామ నాగేశ్వరరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. 176 నిబంధన కింద రాజ్యసభలో స్వల్పకాలిక చర్చ చేపట్టాలని కేశవరావు కూడా నోటీసు ఇచ్చారు. కేంద్రం సమాధానం ఇవ్వకపోతే నిరసన ఉద్ధృతి చేస్తామని తెరాస స్పష్టం చేసింది. రెండు సభల్లో తెరాస సభ్యులను నోటీసులపై చర్చకు అంగీకరించలేదు. లోక్‌సభలో స్పీకర్ నిర్ణయాన్ని నిరసిస్తూ.. నామ సభ్యుల బృందం సభ నుంచి వాకౌట్ చేసింది.
Trs MPs Protest:గత వారమంతా.. ఉభయ సభల్లో తెరాస ఎంపీలు ప్రత్యక్ష ఆందోళనలు కొనసాగాయి. రాజ్యసభలో ఎంపీలు కేశవరావు, సురేష్‌రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు.. కేంద్రమంత్రి పియూష్ గోయల్ సమాధానం ఇచ్చారు. తెలంగాణ ఎంపీలు ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని పియూష్ గోయల్ ఆరోపించారు. ప్రస్తుత సీజన్‌లో సరఫరా చేస్తా అని చెప్పినా... దానిలో ఇంకా... 29 లక్షల టన్నులు తక్కువగా తెలంగాణ ప్రభుత్వం సరఫరా చేసిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. ప్రస్తుత సీజన్లోను భర్తీ చేసి.. తర్వాత భవిష్యత్తు గురించి మాట్లాడాలని కేంద్ర మంత్రి సూచించారు. ఉప్పుడు బియ్యం కోటాలో కూడా తెలంగాణ ఇంకా 17 లక్షల టన్నులు సరఫరా చేయాల్సి ఉందని వివరించారు. బియ్యం నిల్వల విషయంలో క్షేత్రస్థాయి విచారణలో లోపాలు కనిపించాయని కేంద్ర మంత్రి తెలిపారు.