సమగ్ర టీకాల అమలులో తెలంగాణ మంచి పనితీరును కనబరుస్తోంది. ఈ ఏడాది ఆగస్టునాటికి చిన్నారులకు టీకాలను అందించడంలో 87.7 శాతంతో మన రాష్ట్రం జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. టీకాల అమలులో జమ్మూ-కశ్మీర్ 98.3 శాతంతో అగ్రస్థానంలో ఉండగా, రెండోస్థానంలో మేఘాలయ(89.7శాతం) నిలిచింది. తెలంగాణలో 3,63,026 మంది చిన్నారులకు ఆగస్టు నాటికి టీకాలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో 3,58,333(65.3 శాతం) మందికి టీకాల అమలు జరిగింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కొవిడ్ సమయంలో టీకాల అమలు తీరుపై సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాధానమిచ్చింది. జాతీయ సగటు 68.5 శాతంగా వెల్లడించింది.
టీకాల అమలులో దేశవ్యాప్తంగా మూడో స్థానంలో తెలంగాణ!
చిన్నారులకు టీకాలను అందించడంలో 87.7 శాతంతో మన రాష్ట్రం జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కొవిడ్ సమయంలో టీకాల అమలు తీరుపై సభ్యులు అడిగిన ప్రశ్నకు జాతీయ సగటు 68.5 శాతంగా సమాధానమిచ్చింది.
కొవిడ్ కాలంలోనూ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది సమగ్ర టీకాల అమలులో మెరుగైన పనితీరును కనబరుస్తున్నారు. మార్చిలో కొవిడ్ మొదలైనప్పట్నించి తొలి రెండు నెలల పాటు దాదాపుగా టీకాల అమలు తగ్గిపోయింది. ప్రధానంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో ఎక్కువ కేసులు నమోదవుతుండడంతో.. హైదరాబాద్ పరిసరాల్లో టీకాల అమలుపై ప్రభావం పడింది. టీకాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇస్తుండడంతో.. గ్రామీణంలో ఆ ప్రభావం పడకుండా ఆరోగ్యశాఖ చర్యలు తీసుకొంది. జీహెచ్‌ఎంసీలోనూ కొంత తగ్గుముఖం పట్టడంతో ఇక్కడ కూడా టీకాలను చిన్నారులకు ఇప్పించడంపై దృష్టిపెట్టింది. మొత్తంగా చూసుకుంటే.. ఈ ఏడాది తొలి 8 నెలల్లో రాష్ట్రంలో 87.7 శాతం సమగ్ర టీకాల అమలు సాధ్యమైంది. మరింత పక్కాగా టీకాలను ఇప్పించడానికి ఆరోగ్య శాఖ మండలాల వారీగా ఇన్‌ఛార్జులను నియమించింది.