తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Schools: గుడ్​న్యూస్.. విద్యార్థులకు ఆ పుస్తకాలు ఫ్రీ

Sabitha Indrareddy Review on School Education: ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు వర్క్‌ బుక్స్‌... ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నోటు పుస్తకాలను ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి తెలిపారు. పాఠశాలు ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు ఈ పుస్తకాలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Telangana
Telangana

By

Published : May 3, 2023, 3:31 PM IST

Updated : May 3, 2023, 3:48 PM IST

Sabitha Indrareddy Review on School Education: నూతన సచివాలయం అధికారులతో కళకళలాడుతోంది. ప్రారంభమైనప్పటి నుంచి సీఎం కేసీఆర్​తో మొదలు మంత్రులందరూ వివిధ సమస్యలపై జోరుగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఇవాళ పాఠశాల విద్యపై సచివాలయంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు.

ప్రభుత్వ నిర్ణయంతో 24 లక్షల విద్యార్థులకు ప్రయోజనం: ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు వర్క్స్ బుక్స్‌... ఉన్నత పాఠశాలల విద్యార్థులకు నోటు పుస్తకాలను ఉచితంగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 24 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు వర్క్ బుక్స్​, నోటుబుక్స్ అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్థానిక శాసన సభ్యులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాల పంపిణీ, యూనిఫామ్​లను విద్యార్థులకు అందించాలని.. తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాలని అధికారులకు విద్యాశాఖ మంత్రి సూచించారు.

పాఠశాలల ప్రారంభం నాటికి 2 జతల యూనిఫామ్: రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలను బడులు ప్రారంభమయ్యే నాటికి అందజేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గత ఏడాది పాఠ్య పుస్తకాల పంపిణీ కోసం రూ.132 కోట్లు ఖర్చు చేయగా.. రానున్న విద్యా సంవత్సరానికి గాను రూ.200 కోట్లు వెచ్చిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. సర్కారు బడుల్లోని విద్యార్థులందరికీ పాఠశాలలు తెరిచే నాటికి రెండు జతల యూనిఫామ్​లను అందజేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. యునిఫామ్​ల కోసం సుమారు 150 కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు చెప్పారు.

ఆ రోజు పాఠశాలల్లో పండగ వాతావరణం కల్పించాలి: జూన్ 12న పాఠశాలలు ప్రారంభం కానున్నందున.. బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేసి స్థానిక శాసనసభ్యులను, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని విద్యాశాఖ మంత్రి సబిత అధికారులకు సూచించారు. పాఠశాల పునః ప్రారంభం రోజున పాఠశాలల్లో పండగ వాతావరణం కల్పించాలని మంత్రి ఆదేశించారు. 'మన ఊరు - మన బడి' పనులను జూన్ మొదటి వారంలోగా పూర్తి చేయాలని చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య సంచాలకులు శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 3, 2023, 3:48 PM IST

ABOUT THE AUTHOR

...view details