ఆన్ లైన్లో భవన నిర్మాణ అనుమతుల కోసం ఉద్దేశించిన టీఎస్-బీపాస్ బిల్లు సోమవారం శాసనసభ ముందుకు రానుంది. రెండు రోజుల సెలవు అనంతరం ఉభయసభలు తిరిగి సమావేశం కానున్నాయి. ప్రశ్నోత్తరాల అనంతరం రెండు సభల్లోనూ ప్రభుత్వ బిల్లులపై చర్చ చేపడతారు. శుక్రవారం అసెంబ్లీ ఆమోదం తెలిపిన కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన నాలుగు బిల్లులపై శాసనపరిషత్తులో చర్చిస్తారు.
టీఎస్-బీపాస్ సహా ఇతర బిల్లులపై సోమవారం శాసనసభలో చర్చ జరగనుంది. గతంలో జారీ చేసిన ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులపై చర్చ చేపడతారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, విపత్కర పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు-ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత, అదనపు రుణం, ఆయుష్ వైద్యుల పదవీ విరమణ వయస్సు పెంపు, జీఎస్టీ చట్ట సవరణ బిల్లులు ఉన్నాయి. కోర్టు రుసుముల చట్టసవరణ బిల్లుతో పాటు సివిల్ కోర్టుల చట్ట సవరణ బిల్లులు కూడా ఉన్నాయి.