Telangana Assembly Elections Exercise 2023 : కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం పర్యటన అనంతరం శాసనసభ ఎన్నికల కసరత్తు వేగవంతమైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన సన్నాహాకాలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈసీ ప్రతినిధి బృందం.. కొన్ని జిల్లాల్లో మాత్రం ప్రక్రియను ఇంకా వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సంబంధిత ప్రక్రియను వేగవంతం చేశారు.బీఎల్‌ఓల ద్వారా ఇంటింటి పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. ఆరుగురికిపైగా ఉన్న ఓటర్ల ఇళ్లు అన్నింటినీ ఖచ్చితంగా బీఎల్‌ఓలు సందర్శించి క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితిని నివేదించాలని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
అందుకు అనుగుణంగా బీఎల్‌ఓల ఇంటింటి పరిశీలన పూర్తైనట్లు సమాచారం. కొన్ని జిల్లాల నుంచి ఇంకా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి వివరాలు అందాల్సి ఉన్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను రెండోసారి చేపట్టింది. ఇందుకోసం గతంలో ఇచ్చిన షెడ్యూల్‌ను ఈసీ సవరించింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 21న ముసాయిదా జాబితాను ప్రకటించాల్సి ఉంది. ఇందుకోసం కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల పక్రియ కొనసాగుతోంది. అక్టోబరు ఒకటో తేదీ వరకు 18 ఏళ్లు నిండే వారందరూ ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.