SSC exams arrangements in Telangana: పదో తరగతి పరీక్షలకు సమయం ఆసన్నమైంది. విద్యాశాఖ అధికారులు పరీక్షల నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు పరీక్షలు జరుగుతాయి.
రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల 94 వేల 620 మంది విద్యార్థుల కోసం 2వేల 652 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. పాఠశాలలకు హాల్‌టికెట్లను పంపించారు. ఈనెల 24వ తేదీ నుంచి www.bse.telangana.gov.in అను వెబ్‌సైట్‌లో విద్యార్థులకు ఆన్లైన్లో హాల్టికెట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.
డీఈవోలు పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులను పరిశీలించడంతో పాటు పరీక్షా సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్‌ల నియామకం, స్టోరేజీ పాయింట్లకు రహస్య సామగ్రి పంపిణీ, పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, సిబ్బందికి గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ పూర్తయిందని అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఆరోగ్య శాఖ ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్‌లతో పాటు ఒక ఏఎన్‌ఎంను నియమించనున్నారు. వేసవి కాలం దృష్ట్యా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.