Sharmila Respond on Handcuffs To Farmers in Yadadri : యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతులకు బేడీలు వేసి పోలీసులు కోర్టుకు తీసుకువచ్చిన తీరును ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఖండించాయి. ఈ క్రమంలోనే దీనిపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా స్పందించారు. దొర పాలనలో న్యాయమడిగిన అన్నదాతకు తప్పని సంకెళ్లంటూ కేసీఆర్పై విమర్శనాస్త్రాలు సంధించారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటే ఇదేనా దొర అంటూ కేసీఆర్ని సంబోధిస్తూ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు.
YS Sharmila Comments on KCR :నమ్ముకున్న భూమిని ఇచ్చేది లేదన్న రైతులకు బేడీలువేయడమా మీరిచ్చే భరోసా అంటూ కేసీఆర్పై.. వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. మీ బందిపోట్లను ప్రశ్నిస్తే అన్నదాత అని చూడకుండా జైలుకు పంపడమేనా.. బీఆర్ఎస్ నినాదమంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో మద్దతు ధర అడిగితే సంకెళ్లు.. పంట కొనండని అడిగితే సంకెళ్లు.. భూములు పోయాయని అడిగితే సంకెళ్లు.. భూములు ఇవ్వమని చెప్పినా సంకెళ్లు అని వైఎస్ షర్మిల ఆరోపించారు.
ఏది చూసినా అన్నదాతకు దొర ఇచ్చే గిఫ్ట్ సంకెళ్లంటూ వైఎస్ షర్మిల విమర్శించారు. కిసాన్ భరోసా అని.. వచ్చేది రైతు ప్రభుత్వమని చెప్పుకునేందుకు కేసీఆర్ సిగ్గుపడాలని దుయ్యబట్టారు. మీది భరోసానిచ్చే సర్కారు కాదని.. రైతుకు బేడీలు వేసే సర్కారు అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి పేర్కొన్నారు. దేశ చరిత్రలో రైతులను మూడు సార్లు జైలుకు పంపిన చరిత్ర మీదే అంటూ ఎద్దేవా చేశారు. భూములు పోతున్నాయి మహాప్రభో అని నిరసన తెలిపితే అరెస్టులు చేయిస్తారా అంటూ అగ్రహం వ్యక్తం చేశారు.