Revanth Reddy Tweet On KTR Comments Rahul Gandhi : వ్యవసాయం గురించి రాహుల్ గాంధీకి ఏం తెలుసంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. రాహుల్ గాంధీ మహిళా కూలీలతో కలిసి నాట్లు వేసిన ఫొటోలను పంచుకున్న రేవంత్.. కేటీఆర్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. వ్యవసాయం అంటే అమెరికాలో అంట్లు తోమడం కాదు డ్రామా రావు అంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
ఎవుసం అంటే.. జూబ్లీహిల్స్ గెస్ట్ హౌస్‌లో సేద తీరడం కాదని రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే సినిమా వాళ్లతో పార్టీలు చేసుకోవడం కాదని ట్వీట్ చేశారు. వ్యవసాయం అంటే మట్టి మనసుల పరిమళమని.. మట్టి మనుషుల ప్రేమ అంటూ ట్విటర్లో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఎడ్లు-వడ్లు అని ప్రాసకోసం పాకులాడే.. గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన అంటూ ధ్వజమెత్తారు.
"వ్యవసాయం అంటే అమెరికాలో అంట్లు తోమడం కాదు డ్రామారావు. ఎవుసం అంటే జూబ్లీహిల్స్ గెస్ట్ హౌజ్‌లలో సేద తీరడం కాదు.. సినిమా వాళ్లతో పార్టీలు చేసుకోవడం కాదు. అది మట్టి మనసుల పరిమళం. మట్టి మనుషుల ప్రేమ. ఎడ్లు-వడ్లు అని ప్రాస కోసం పాకులాడే.. ‘గాడిద’కేం తెలుసు గంధపు చెక్కల వాసన."- ట్విటర్లో రేవంత్ రెడ్డి
రాహుల్‌ని అనే ముందు కేటీఆర్‌కు వ్యవసాయం గురించి తెలుసా? :ఇవే వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ సహ ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. రాహుల్ గాంధీని అనే ముందు.. కేటీఆర్‌కు అసలు వ్యవసాయం గురించి ఏం తెలుసో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై విమర్శలు చేసే స్థాయి మంత్రి కేటీఆర్‌కు లేదన్నారు. ఈ వ్యాఖ్యలు అర్ధ రహితమని పొంగులేటి ఖండించారు. ఒకవైపు మీరు వేలు చూపితే.. మిగిన నాలుగు వేళ్లు మీ వైపు చూపుతాయని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మొదటిసారి అంబర్‌పేట్‌లోని కాంగ్రెస్ మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంత రావును పొంగులేటి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ ఏ గీత గీస్తే.. దాన్ని శిరసావహిస్తానని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన ఆరోపణలు ఇవే..: ఆదివారం జగిత్యాలలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీకి ఎడ్లు తెలవదు.. వడ్లు తెలవదు.. తెలిసిందల్లా క్లబ్బులు, పబ్బులు మాత్రమేనని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో రైతులను ఆ పార్టీ రాబందుల్లా పీక్కుతిందని మండిపడ్డారు. కేటీఆర్ మాటలకు నేడు రేవంత్ రెడ్డి, పొంగులేటి సహా పలువురు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు.
ఇవీ చదవండి :