హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ ముమ్మర సహాయక చర్యలు చేపడుతోంది. భారీవర్షాలు ముంచెత్తనున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం 40 బోట్లను సిద్ధం చేసింది. ఏపీ, తెలంగా రాష్ట్రాలకు చెందిన 40 బోట్లు రవీంద్రభారతికి చేరుకున్నాయి. ఏపీ నుంచి 30మంది సభ్యుల విపత్తు నిర్వహణ బృందం హైదరాబాద్ చేరుకుంది. ప్రమాదకరంగా ఉన్న చెరువుల ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్యటిస్తూ.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. జీడిమెట్ల ఫాక్స్‌సాగర్ చెరువు తూము లీకేజీ అవుతుండటం వల్ల అధికారులు పరిస్థితిని సమీక్షించారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిపుణుల బృందాన్ని పిలిపించి పరిస్థితిని వివరిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి భోజనం సహా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఇబ్బందిగానే ఉన్నా.. సమయానికి కనీసం భోజనమైనా అందుతోందని బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారు.
వ్యాధులు ప్రబలకుండా చర్యలు
వరద తగ్గిన ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులను జీహెచ్‌ఎంసీ వేగంగా కొనసాగిస్తోంది. చెత్తా, చెదారం తొలగిస్తూ కాలనీలను మునుపటిలా మార్చేందుకు పురపాలక సిబ్బంది శ్రమిస్తున్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా ముంపునకు గురైన ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయడం, శానిటైజేషన్ కార్యక్రమాలను.. ఎంటమాలజీ విభాగం చేపడుతోంది. ప్రజలు కాచి, వడబోసిన నీటిని మాత్రమే తాగాలని... అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తగా ఉండాలని ఎంటమాలజీ అధికారులు సూచిస్తున్నారు.