Prakash Ambedkar met CM KCR: భారత రాజ్యంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేడ్కర్ జయంతి వేడుకలు రాష్ట్రంలో ఘనంగా జరిగాయి. హైదరాబాదులో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణకి తన మునిమనవడు, మాజీ లోక్‌సభ సభ్యులు ప్రకాశ్ అంబేడ్కర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఉదయం హైదరాబాద్ చేరుకున్న ప్రకాశ్ అంబేడ్కర్ మధ్యాహ్నం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కలిశారు. ఆయనను కేసిఆర్ సాదరంగా ఆహ్వానించారు. శాలువాతో ఘనంగా సత్కరించారు. ఇరువురు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అనంతరం ఇరువురు నేతలు మధ్యాహ్నం భోజనం చేసి విగ్రహ సభా స్థలికి బయలుదేరి వెళ్లారు. స్వాతంత్య్రం తర్వాత మతాలకు అతీతంగా అందరూ పవిత్రంగా భావించేది అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమని.. అంతటి మహానుభావుడి విగ్రహావిష్కరణలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఇరువురు నేతలు తెలిపారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గోన్న అంబేడ్కర్ మనవడు:కేసీఆర్‌తో భేటీకి ముందు ప్రకాశ్ అంబేడ్కర్ బేగంపేట్‌లో ఎంపీ సంతోష్ కుమార్‌ను కలిశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్లొన్నారు. ఛాలెంజ్‌లో భాగంగా మొక్కను నాటారు. అంబేద్కర్ జయంతి రోజును గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. వారు కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తనను కలవాలనుకునే ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటిన తర్వాత రావాలని అంబేడ్కర్ కోరినట్లు గుర్తుచేశారు. మొక్కలు నాటడం పట్ల అంబేడ్కర్‌కు అమితమైన ఆసక్తి ఉండేదని ఆయన తెలిపారు. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ స్ఫూర్తిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో చూస్తున్నానని ప్రకాశ్ అంబేడ్కర్ తెలిపారు. ఈ ఛాలెంజ్‌లో సంతోష్ కుమార్ కు మరింత గుర్తింపు రావాలని ఆకాంక్షించారు.