Banjarahills pub case: బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో నిందితులను కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ఏడు రోజులు కస్టడీ కోరారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎంత మందికి కొకైన్ అందించారు? పబ్‌లో ఉన్న వారు ఎంత మంది మాదకద్రవ్యాలు సేవించారు? గతంలో ఇలాంటి పార్టీలు ఎన్ని నిర్వహించారు? అనే అంశాలపై విచారణ చేసేందుకు పోలీసులు కస్టడీ కోరినట్లు తెలుస్తోంది. పబ్ మేనేజర్ అనిల్, భాగస్వామి అభిషేక్‌లను వారం రోజులు కస్టడీ కోరారు. ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు ఏ4గా కిరణ్‌రాజ్‌ను చేర్చారు. గతంలో పుడింగ్ అండ్ మింక్ పబ్ నడిపినట్లు సమాచారం. అభిషేక్ ఐఫోన్‌ను సీజ్ చేసిన పోలీసులు... అతని చరవాణిలో కీలక సమాచారం ఉంటుందని భావిస్తున్నారు. కస్టడీలోకి తీసుకున్న అనంతరం విచారణలో భాగంగా అతని కాంటాక్ట్స్, వాట్సాప్ చాటింగ్ తనిఖీ చేయనున్నారు.
దర్యాప్తు వేగవంతం:బంజారాహిల్స్ ఠాణా పరిధిలోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పబ్ లోపలికి డ్రగ్స్ ఏ విధంగా వచ్చాయని విచారణ చేస్తున్నారు. ఇప్పటికే పబ్‌లోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పబ్ ఉన్న రాడిసన్ బ్లూ హోటల్‌లోని ఫుటేజ్‌ని కూడా సేకరించారు. కేసులో ఎ1గా ఉన్న పబ్ భాగస్వామి అభిషేక్... సినీ, రాజకీయ ప్రముఖులతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల నుంచి కూడా ఈ పబ్‌ను బుక్ చేసుకుని వస్తుంటారు. 24గంటలూ మద్యం అందుబాటులో ఉంటడం వల్ల... తరచూ పార్టీలు చేసుకుంటున్నట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. చాలా రోజులుగా ఈ పబ్‌లో ఈ తరహా పార్టీలు జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.