తెలంగాణ

telangana

By

Published : Nov 7, 2020, 8:28 AM IST

ETV Bharat / state

నకిలీ జీపీఎస్‌ లొకేషన్‌తో ఆన్‌లైన్‌ రమ్మీ.. నిషేధంతో కొత్త ఎత్తుగడ

ఆన్​లైన్​ రమ్మీ జేబులు గుల్ల చేస్తోందని గ్రహించి ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా పేకాట రాయుళ్ల దొంగాట ఆగడం లేదు. నకిలీ జీపీఎస్​ ద్వారా ఆన్​లైన్​లో పేకాట ఆడుతున్నారు. బోయిన్​పల్లిలో ఓ యువకుడు రూ.20 లక్షలు పేకాటలో పోగొట్టుకోవడం వల్ల ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇలాంటి పేకాటరాయుళ్లు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలోనే ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు

Online rummy with fake GPS location in telangana
నకిలీ జీపీఎస్‌ లొకేషన్‌తో ఆన్‌లైన్‌ రమ్మీ.. నిషేధంతో కొత్త ఎత్తుగడ

హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన ఓ యువకుడు ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడి సుమారు రూ.20 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. నిర్వాహకులు తనను మోసం చేశారంటూ, పోగొట్టుకున్న డబ్బులు ఇప్పించాలంటూ సైబర్‌క్రైమ్‌ పోలీసుల్ని ఆశ్రయించాడు. రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం అమల్లో ఉంది కదా అని సైబర్‌క్రైమ్‌ పోలీసులు ఆరా తీస్తే అసలు రహస్యం బయటపడింది. నకిలీ జీపీఎస్‌ లొకేషన్‌ ద్వారా సదరు యువకుడు ఆన్‌లైన్‌లో పేకాట ఆడినట్లు గుర్తించారు. ఇలాంటి పేకాటరాయుళ్లు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలోనే ఉంటారని అనుమానిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం విధించారు. కాగా నైపుణ్యంతో ఆడే ఆటగా పేర్కొంటూ కొన్ని రాష్ట్రాల్లో ఈ తరహా జూదం ఆడేందుకు అనుమతులు ఉండటంతో ఇక్కడి పేకాటరాయుళ్లు అడ్డదారులు తొక్కుతున్నారు. ఆన్‌లైన్‌ రమ్మీ నిర్వహించే సంస్థలు తెలంగాణలోని లొకేషన్‌తో ఉండే ఇంటర్‌నెట్‌ ప్రోటోకాల్‌ చిరునామా(ఐపీ అడ్రస్‌)లకు యాక్సెస్‌ ఇచ్చే అవకాశం లేకపోవడంతో నకిలీ గ్లోబల్‌ పొజిషనింగ్‌ వ్యవస్థ(జీపీఎస్‌) ద్వారా నిర్వాహకుల్ని ఏమార్చుతున్నారు. ఇందుకోసం సెల్‌ఫోన్‌ లొకేషన్‌ పొరుగు రాష్ట్రాల్లో ఉన్నట్లు చూపించే యాప్‌లను తమ ఫోన్లలో నిక్షిప్తం చేసుకుంటున్నారు. ఇలాంటి యాప్‌లు అంతర్జాలంలో ఉచితంగానే అందుబాటులో ఉండటం వీరికి కలిసివస్తోంది. ఎక్కువగా పొరుగునే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, గోవాల లొకేషన్‌లో ఉన్నట్లు చూపి ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతున్నట్లు దర్యాప్తు అధికారుల దృష్టికి వచ్చింది.

జూదరులపై సంస్థల మాయాజాలం

తెలంగాణలో గతంలో పలు క్లబ్‌లలో గుట్టుగా పేకాట నిర్వహణ సాగేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్లబ్‌ల్లో జూద నిర్వహణపై కఠిన చర్యలకు ఆదేశించడంతో ఆ దందా ఆగిపోయింది. కొంతకాలం పాటు పేకాటరాయుళ్లు పొరుగునే ఉన్న బీదర్‌, గుల్బర్గాతో పాటు చెన్నై, గోవా, శ్రీలంక తదితర ప్రాంతాలకు వెళ్లి పేకాట ఆడేవారు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లోనే జూదం ఆడేందుకు పలు సంస్థలు తెరపైకి రావడంతో జూదరుల దృష్టి వీటి పైకి మళ్లింది. ఫిర్యాదులు రావడంతో రాష్ట్రంలో ఆన్‌లైన్‌ జూదంపైనా ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో నకిలీ జీపీఎస్‌ కుతంత్రాలకు జూదరులు తెరలేపారు. జూదరులకు తొలుత కొంత లాభాలు వచ్చేట్లు చేసి తర్వాత డబ్బు భారీగా పోగొట్టుకునేలా నిర్వాహకులు ప్రోగ్రామింగ్‌ రూపొందిస్తున్నట్లు సైబర్‌క్రైం పోలీసులు గుర్తించారు. చైనా ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ సంస్థల్లోనూ ఇదే తరహా మోసాలు వెలుగు చూశాయి.

ఇవీ చూడండి: మిస్సింగ్​ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాం: సీపీ సజ్జనార్​

ABOUT THE AUTHOR

...view details