తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎరువులకు ఇక ఒకటే బ్రాండ్‌, భారత్‌ యూరియా భారత్‌ డీఏపీ - Bharat brand fertilizers in India

One Nation One Fertilizer వ్యవసాయంలో కేంద్ర ప్రభుత్వానిదే ప్రధాన పాత్ర అని రైతులకు సులభంగా చెప్పేలా కేంద్రం రెండు కొత్త పథకాలను తాజాగా అమల్లోకి తెచ్చింది. ఒక దేశం.. ఒకటే ఎరువు అనే నినాదాన్ని తీసుకువచ్చింది. ఇకపై ఎరువులన్నింటికీ ఒకటే బ్రాండు ఉంటుంది. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది.

one nation one fertilizer
one nation one fertilizer

By

Published : Aug 25, 2022, 6:50 AM IST

One Nation One Fertilizer: వ్యవసాయంలో కేంద్ర ప్రభుత్వానిదే ప్రధాన పాత్ర అని రైతులకు సులభంగా చెప్పేలా కేంద్రం రెండు కొత్త పథకాలను తాజాగా అమల్లోకి తెచ్చింది. ‘ఒక దేశం.. ఒకటే ఎరువు’ అనే నినాదంతో ఇకపై ఎరువులన్నింటికీ ఒకటే బ్రాండు ఉంటుంది. దీనిని ప్రధానమంత్రి భారతీయ జనఉర్వారక్‌ పరియోజన(పీఎంబీజేపీ)గా వ్యవహరిస్తారు. అలాగే గ్రామస్థాయిలో ఎరువుల దుకాణాలు ప్రధానమంత్రి కిసాన్‌ సమృద్ధి కేంద్రాలుగా ఆవిర్భవిస్తాయి.

అక్టోబరు 2న గాంధీ జయంతి రోజు నుంచి..పీఎంబీజేపీ ప్రకారం అన్ని రకాల ఎరువులను కంపెనీలు ఇక ఒకటే బ్రాండుతో మార్కెట్‌లో అమ్మాలి. భారత్‌ యూరియా, భారత్‌ డీఏపీ, భారత్‌ మ్యూరేట్‌ ఆఫ్‌ ఫొటాష్‌(ఎంఓపీ), భారత్‌ ఎన్‌పీకే.. ఇలా ఉండాలి. ఇంతకాలం ఒక్కో కంపెనీ ఒక్కో పేరుతో ఎరువులను ప్రత్యేక బ్రాండ్లతో విక్రయిస్తున్నాయి. ఇకనుంచి అలా కుదరదని కేంద్రం స్పష్టం చేస్తూ బుధవారం ఉత్తర్వులిచ్చింది.

వచ్చే నెల 15 నుంచి పాత పద్ధతిలోని ఖాళీ సంచులను ఏ కంపెనీ కూడా కొనరాదని తెలిపింది. అక్టోబరు 2న గాంధీ జయంతి రోజు నుంచి ‘భారత్‌ బ్రాండు’ పేరుతో ముద్రించిన ఎరువులను మార్కెట్‌లో విక్రయించడం ప్రారంభించాలని స్పష్టం చేసింది. ‘‘..అయితే ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న పాత బ్రాండ్ల బస్తాలన్నింటినీ డిసెంబరు 31లోగా అమ్మేయాలి. ఆ తరవాత ఇక ఎక్కడా పాత పేర్లతో ఎరువు బస్తా సంచులు మార్కెట్‌లో కనపడకూడదు. భారత్‌ బ్రాండువే ఉండాలి’’ అని వివరించింది. యూరియా బస్తా అయితే ఆ సంచిపై ఒకవైపు మూడొంతుల భాగం ‘భారత్‌ యూరియా, ప్రధానమంత్రి భారతీయ జనఉర్వారక్‌ పరియోజన’ అని ముద్రించాలి. మిగిలిన భాగంలో ఆ ఎరువు ఉత్పత్తి చేసే కంపెనీ వివరాలు ఉండాలి.

ఎరువుల దుకాణాల్లో భూసార, విత్తన, ఎరువు నాణ్యత పరీక్షలు..ఎరువుల చిల్లర విక్రయ దుకాణాల్లో రైతులకు ఇక అన్ని రకాల సేవలు అందించడానికి ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమృద్ధి కేంద్రం’(పీఎంకేఎస్‌కే) అనే పథకాన్ని అమల్లోకి తెస్తూ కేంద్ర ఎరువుల శాఖ బుధవారం మరో ఉత్తర్వు జారీచేసింది. ‘వన్‌ స్టాప్‌ షాప్‌’ పేరుతో మోడల్‌ ఎరువుల దుకాణాల్లో రైతులకు కావాల్సినవన్నీ లభించేలా చూడాలని సూచించింది.

విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వంటి వాటిని నిర్ణీత ధరలకే అమ్మాలి. భూసార, విత్తన, ఎరువు నాణ్యత పరీక్షలు చేయాలి. వ్యవసాయానికి అవసరమైన అన్ని రకాల పరికరాలు అమ్మేలా చూడాలి. సాగులో మేలైన పద్ధతులను పాటించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఈ కేంద్రాల్లో రైతులకు ఇవ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే పథకాల సమాచారం అందించాలి.

* దేశంలో మొత్తం 3.30 లక్షల ఎరువుల దుకాణాలున్నాయి. పైలెట్‌ ప్రాజెక్టు కింద జిల్లా స్థాయిలో 864 దుకాణాలను వచ్చే అక్టోబరు 2 నాటికి ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమృద్ధి కేంద్రం’గా మార్చాలి.

* మొదటి దశలో నవంబరు నాటికి 31,460, జనవరి(2023) నాటికి 1,82,126, మూడో దశలో వచ్చే ఫిబ్రవరి ఆఖరుకల్లా మిగిలిన 1,16,049 దుకాణాలను ఈ కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి

* గ్రామస్థాయిలో అయితే 150, మండల స్థాయిలో 200, జిల్లా స్థాయిలో 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ దుకాణం ఉండాలి.

* మండల, జిల్లాస్థాయి దుకాణాల్లో స్మార్ట్‌టీవీ, ఇంటర్‌నెట్‌ సదుపాయంతో ఉండాలి. వ్యవసాయ సంబంధ చిత్రాలను టీవీలో ప్రదర్శించాలి.

* కిసాన్‌ కీ బాత్‌ పేరుతో ప్రతి నెలా రెండో శనివారం చుట్టుపక్కల ప్రాంతాల రైతులతో అక్కడ సమావేశాలు ఏర్పాటుచేయాలి. ఈ సమావేశాల్లో ఏం చర్చించాలనే అంశాలతో కేంద్ర ఎరువుల శాఖ నెలవారీ క్యాలెండర్‌ను విడుదల చేస్తుంది.

* ప్రతి దుకాణానికి వచ్చే ఆదర్శ రైతులతో ‘కిసాన్‌ సమృద్ధి బృందం’ పేరుతో వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటుచేసుకుని అన్ని రకాల వ్యవసాయ సంబంధ సమాచారాన్ని అందులో పంచుకోవాలి.

ABOUT THE AUTHOR

...view details