New Police Stations In Hyderabad: సమాజంలో శాంతి భద్రతలు కాపాడటంలో, ప్రశాంత వాతావరణం కల్పించడంలో పోలీసు వ్యవస్థ పాత్ర ప్రధాన పాత్ర పోషిస్తుంది. కేవలం ముఖ్యమైన సందర్భాల్లోనే కాకుండా.. సామాన్య ప్రజలు రోజూ ప్రశాంతంగా నిద్ర పోవాలన్నా దాని వెనుక పోలీసుల కృషి ఎంతో ఉంటుంది. నేరలు నియంత్రించడం, నేరస్థులకు శిక్షలు పడటం, తిరిగి అలాంటికి జరగకుండా కాపాడుతుంటారు.
ముఖ్యంగా కోటికి పైగా జనాభా నివసించే మన రాజధాని నగరం హైదరాబాద్‌లో శాంతి భధ్రతలు కాపాడటం కత్తి మీద సాము లాంటిదే. ఇందుకు అవసరమైన స్టేషన్లు, సిబ్బంది ఉండాలి. ఇప్పటికే నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో బలమైన పోలీసు వ్యవస్థ ఉన్నప్పటికీ దాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసింది. దీనికోసం మరిన్ని నూతన పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. ఇందులో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసు స్టేషన్లతో పాటు మహిళా పీఎస్‌లకు కూడా ఉండటం విశేషం.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా ఏర్పాటైన డివిజన్లు, జోన్లు, ఠాణాలకు ఉన్నతాధికారులు హద్దును నిర్ణయించారు. అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం భవనాలను పరిశీస్తున్నారు. కొన్నింటికి హద్దులు సైతం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కొత్తగా 13 లా అండ్ ఆర్డర్, ప్రస్తుతం ఉన్న బేగంపేటతో పాటు.. కొత్తగా 5 మహిళా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అన్ని మహిళా పోలీస్ స్టేషన్లలో ప్రత్యేకంగా ఉమెన్ సేప్టీ వింగ్ జోన్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. మొత్తం 8 జోన్లు వాటి హద్దులు, ఠాణాలు, ఏసీపీ డివిజన్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తిచేశారు.
జోన్ల పరంగా వివరాలు:
1.సెంట్రల్ జోన్: అబిడ్స్ రోడ్, నాంపల్లి పోలీస్ స్టేషన్లను అబిడ్స్ ఏసీపీ డివిజన్‌గా ఏర్పాటు చేశారు. చిక్కడపల్లి, ముషీరాబాద్ పీఎస్‌లు కలిపి చిక్కడపల్లి డివిజన్‌గా ఏర్పాటైంది. పాత గాంధీనగర్ పోలీస్ స్టేషన్, లేక్ పీఎస్‌లు.. కొత్తగా ఏర్పాటైన దోమల్‌గూడ ఠాణాలను గాంధీనగర్ కొత్త డివిజన్లో కలిపారు. పాత సైఫాబాద్ ఠాణా, కొత్తగా ఏర్పడ్డ ఖైరతాబాద్ స్టేషన్లను సైఫాబాద్ ఏసీపీ డివిజన్లో విలీనం చేశారు.
2.ఈస్ట్ జోన్ (తూర్పు మండలం): ప్రస్తుతం ఉన్న అంబర్ పేట, కాచిగూడ పీఎస్‌లను కాచిగూడ డివిజన్లో ఉంచారు. లాలాగూడ, చిలకలగూడతో పాటు కొత్తగా ఏర్పడ్డ వారాసిగూడ ఠాణాలు ఇక నుంచి చిలకలగూడ డివిజన్లో పనిచేయనున్నాయి. ఓయూ, నల్లకుంట పీఎస్‌లు కొత్తగా ఏర్పడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీ డివిజన్లో కలిపారు. అప్జల్ గంజ్, సుల్తాన్ బజార్, నారాయణ గూడ స్టేషన్లను సుల్తాన్ బజార్ డివిజన్‌లోనే ఉంచారు.