రాష్ట్రంలో దెబ్బతిన్న రహదారుల్లో సింహభాగం జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) పర్యవేక్షణలోనివేనని రాష్ట్ర అధికారులు తెలిపారు. ఎన్‌హెచ్‌ఏఐ, ఉపరితల రవాణా మంత్రిత్వశాఖల తీరుతోనే రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పారు. ‘‘తెలంగాణలో 3,824 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు ఉన్నాయి. అందులో 1,551 కిలోమీటర్లు ఆర్‌అండ్‌బీ పరిధిలో, మిగిలిన 2,273 కిలోమీటర్లు ఎన్‌హెచ్‌ఏఐ పర్యవేక్షణలో ఉన్నాయి. అందులో 450 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి’’ అని రహదారులు-భవనాలశాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్‌లు ఐ.గణపతిరెడ్డి(జాతీయ రహదారులు), రవీందర్‌రావు(రాష్ట్ర రహదారులు) గురువారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు.
దెబ్బతిన్న రోడ్లలో జాతీయ రహదారుల సంస్థవే అధికం
రాష్ట్రంలో దెబ్బతిన్న రోడ్లపై ఈనాడు-ఈటీవీ భారత్ కథనాలపై రోడ్లు భవనాల శాఖ స్పందించింది. రాష్ట్రంలో అధికశాతం ఎన్‌హెచ్‌ఏఐ పరిధిలోనివేనని రాష్ట్ర అధికారులు తెలిపారు. కేంద్ర సంస్థల తీరుతోనే రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. జాతీయ రహదారుల మరమ్మతులకు నిధులు ఇవ్వాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖకు విన్నవించినా ఫలితం లేదన్నారు.
‘దారుణ దారులు’ శీర్షికన గురువారం ‘ఈనాడు, ఈటీవీ భారత్’లో వెలువడిన కథనంపై స్పందించిన అధికారులు ఈ వివరాలు వెల్లడించారు. ‘‘జగిత్యాల- కరీంనగర్- వరంగల్- ఖమ్మం; ఖమ్మం- అశ్వారావుపేట; సంగారెడ్డి- నర్సాపూర్- తూప్రాన్- గజ్వేల్- భువనగిరి- చౌటుప్పల్; మద్నూర్- బోధన్; హైదరాబాద్- మన్నెగూడ మార్గాలను కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులుగా ప్రకటించినప్పటికీ ఎలాంటి మెరుగుదల పనులు చేపట్టలేదు. దీంతో వాటి పరిస్థితి ఘోరంగా ఉంది. ఎన్‌హెచ్‌ఏఐ నియంత్రణలో ఉన్న జాతీయ రహదారుల మరమ్మతులకు నిధులు ఇవ్వాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖకు పలు దఫాలు విన్నవించినా ఫలితం లేదు. మరమ్మతులు చేపట్టాలని ఎన్‌హెచ్‌ఏఐ సంస్థ ఛైర్మన్‌కు రాష్ట్ర ముఖ్యకార్యదర్శి ఇటీవల లేఖ కూడా రాశారు. కొన్ని ప్రాంతాల్లో తాత్కాలిక మరమ్మతులు చేపట్టాం. ఎన్‌హెచ్‌ఏఐ నిధులిస్తే.. దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆర్మూర్-నందిపేట రహదారి నీట మునగడంతో దెబ్బతింది. దీంతోపాటు కామారెడ్డి పట్టణంలోని రహదారికి మరమ్మతులు చేస్తాం. గత అయిదేళ్లలో రహదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.పది వేల కోట్లు ఖర్చు చేసింది’’ అని ప్రకటనలో తెలిపారు.
ఇవీ చూడండి: ప్రయాణం ప్రయాసే... గమ్యం చేరేలోపు ప్రతిక్షణం గండమే!