Dharani Portal Modules: ధరణి పోర్టల్‌లో వస్తున్న సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు కొనసాగుతోంది. పోర్టల్ లావాదేవీల్లో తలెత్తిన సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే కొన్ని మాడ్యూల్స్ (Dharani Portal Modules) అందుబాటులోకి తెచ్చారు. అయినా ఇంకా కొన్ని సమస్యలు రైతులకు ఇబ్బందిగా మారాయి. ప్రధానంగా పేర్ల ముద్రణలో తప్పిదాలు, సర్వే విభాగాల్లో పొరపాట్లు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, తప్పుగా నిషేధిత భూముల జాబితాలోకి వెళ్లడం వంటి సమస్యలున్నాయి.
మాడ్యుల్స్‌పై అవగాహన...
వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు (Financial Harish Rao)నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం.. కొన్నాళ్లుగా అధికారులతో చర్చిస్తోంది. పలు దఫాలుగా సమావేశమై... సమస్యల పరిష్కారం దిశగా తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేసింది. ఇప్పటికే ఉన్న మాడ్యూల్స్‌పై అవగాహన కల్పించడం సహా మరికొన్నింటిని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా మరో 5, ఆరు మాడ్యూల్స్‌ను అధికారులు సిద్ధం చేశారు.
ప్రస్తుతం అవి పరిశీలన దశలో ఉన్నాయి. తదుపరి భేటీలో వాటిని మంత్రివర్గ ఉపసంఘం ముందు ఉంచనున్నారు. ఆ మాడ్యూల్స్ అందుబాటులోకి వస్తే ప్రస్తుత సమస్యల్లో 75 నుంచి 80 శాతం వరకు పరిష్కారం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. మిగిలే కొద్దిపాటి సమస్యలకు త్వరగానే పరిష్కారాలు చూడవచ్చని చెబుతున్నారు. తద్వారా భూలావాదేవీలకు చెందిన సమస్యలు దాదాపుగా సమసిపోతాయని భావిస్తున్నారు.