ED investigating MLC Ramana: క్యాసినో వ్యవహారంలో విచారణలో భాగంగా తెరాస ఎమ్మెల్సీ రమణ ఈడీ ఎదుట హాజరయ్యారు. క్యాసినో కోసం విదేశాలకు వెళ్లినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై ప్రశ్నించేందుకు విచారణకు రావాలని రమణకు ఇది వరకే నోటీసులు జారీచేసింది. ఇందులో భాగంగా ఎల్.రమణ హైదరాబాద్ కార్యాలయానికి వచ్చారు. బ్యాంకు లావాదేవీలు తీసుకుని వచ్చిన ఎల్.రమణ... విచారణ ముగిసిన తర్వాత వివరంగా మాట్లాడతానని చెప్పి లోపలికి వెళ్లారు. మంత్రి తలసాని పీఏ హరీశ్‌కు సైతం ఈడీ నోటీసులు జారీచేసింది. వచ్చే వారం ఈడీ ముందు హరీశ్ హాజరుకానున్నారు.
జూదం ఆడే క్రమంలో పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు జరిగిందనే అనుమానంతో నాలుగు నెలలుగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఫెమా ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై క్యాసినోల నిర్వాహకుడు చీకోటి ప్రవీణ్, ప్రభాకర్‌రెడ్డిలతో పాటు వారితో సంబంధం ఉన్న వారిని పిలిచి విచారిస్తున్నారు. ఈక్రమంలోనే అనంతపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని గురువారం ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకు విచారించింది. చీకోటి ప్రవీణ్ వ్యాపారలావాదేవీలు పరిశీలించినప్పుడు.. గుర్నాథరెడ్డి నుంచి నిధుల బదిలీ జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించగా... ఆ విషయంపై స్పష్టత కోసం విచారించినట్లు తెలుస్తోంది.