తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌ ముందుకు తీసుకురావాలి: కవిత

MLC Kavitha on Women's Reservation Bill: త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టి.. ఆమోదించాలని భారత్‌ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. ఇందుకోసం భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో దిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద ఈ నెల 10న ఒకరోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు.

MLC Kavitha
MLC Kavitha

By

Published : Mar 2, 2023, 3:45 PM IST

Updated : Mar 2, 2023, 6:39 PM IST

MLC Kavitha on Women's Reservation Bill: రానున్న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌ ముందుకు తీసుకురావాలని భారత్‌ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌ చేశారు. బీజేపీ తమ ఎన్నికల ప్రణాళికలో రెండుసార్లు హామీ ఇచ్చి.. మాట తప్పుతోందని ఆమె ఆరోపించారు. ఇందుకు నిరసనగా.. భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో దిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద ఈ నెల 10వ తేదీన ఒక రోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు కవిత ప్రకటించారు. మహిళా దినోత్సవమైన 8న హోళీ పండుగ నేపథ్యంలో 10న కార్యక్రమం చేపడుతున్నామని.. ఇందుకు అన్ని పార్టీలు, సంఘాలను ఆహ్వానిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జనగణన చేపట్టని మోదీ సర్కారు.. ఎట్టి పరిస్థితుల్లోనూ జనాభా లెక్కలు తీయాల్సిందేనన్నారు.

దిల్లీ మద్యం కుంభకోణంలో తదుపరి అరెస్టు కవితేనన్న బీజేపీ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో మర్యాదపూర్వకమైనవి కాదని కవిత పేర్కొన్నారు. అరెస్టులపై దర్యాప్తు సంస్థలు చెప్పాలి కానీ.. బీజేపీ చెబితే ఎలా అని మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలతో మ్యాచ్ ఫిక్సింగ్‌ను బీజేపీ నేతలు బయట పెట్టుకుంటున్నారన్నారు. ఈ క్రమంలోనే దర్యాప్తు సంస్థలు పని చేయాల్సిందేనని.. అయితే ప్రతిపక్షాలపైనే ఎందుకు చేస్తున్నాయని కవిత ప్రశ్నించారు. అదానీ అక్రమాలపై కోర్టులు చెప్పే వరకు దర్యాప్తు సంస్థలు ఎందుకు స్పందించవని నిలదీశారు. దేశంలో బీజేపీ వైఫల్యాలను ఎత్తిచూపిన వారిపైనే సీబీఐ, ఈడీ దాడులు చేస్తున్నారని కవిత ఆరోపించారు.

మేం అలా అంటే బీజేపీ వాళ్లు ఏం చెప్తారు..: మద్యం కుంభకోణంపై దృష్టి మరల్చేందుకే కవిత ప్రయత్నమన్న బీజేపీ విమర్శలపైనా కవిత స్పందించారు. అదానీ అంశం నుంచి దృష్టి మరల్చేందుకే గ్యాస్ ధర పెంచారని అంటే బీజేపీ ఏం చెబుతుందని ప్రశ్నించారు. అదానీ అక్రమాలపై పార్లమెంటరీ సంయుక్త విచారణ కమిటీ విచారణ జరపాలన్నదే బీఆర్‌ఎస్‌ డిమాండ్ అని కవిత పునరుద్ఘాటించారు. ఎన్నికల కమిషన్‌ అంశంలో సుప్రీంకోర్టు ఆదేశాలు స్వాగతిస్తున్నామని.. అయితే బీజేపీ అమలు చేస్తుందో లేదో చూడాలన్నారు.

''చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదించాలి. దిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద 10న దీక్ష చేయబోతున్నాం. అన్ని పార్టీలు, సంఘాలను ఆహ్వానిస్తున్నాం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జనాభా లెక్కల కార్యక్రమం చేపట్టని మోదీ ప్రభుత్వం.. జనగణన చేసి తీరాల్సిందే.'' - కల్వకుంట్ల కవిత, భారత్‌ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ

మహిళా రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌ ముందుకు తీసుకురావాలి: కవిత

kavitha on gas price hike..: మరోవైపు గ్యాస్‌ ధరల పెంపుపైనా ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఇప్పటికే గ్యాస్‌ సిలిండర్‌ ధరలు సామాన్యుడికి గుదిబండగా మారగా.. తాజాగా మరోసారి పెంపుతో వారి పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారిందని విమర్శించారు. గతంలో సిలిండర్‌ ధర రూ.400 ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన బీజేపీ నేతలు.. ప్రస్తుతం ధర రూ.1200 చేరితే ఎందుకు నోరు మెదపడం లేదని మండిపడ్డారు.

ఇవీ చూడండి..

'వంటగ్యాస్‌పై కేంద్రం బండ బాదుడు.. ఇదేనా మహిళా దినోత్సవానికి మోదీ కానుక?'

గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా BRS నిరసనలు

Last Updated : Mar 2, 2023, 6:39 PM IST

ABOUT THE AUTHOR

...view details