తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆగమైనోళ్లను అయినవాళ్ల దగ్గరికి చేర్చి ఆనందం నింపారు... - CRIME NEWS IN TELANGANA

ఎటు వెళ్తున్నారో తెలియదు... కానీ నడక ఆపరు. ఏం చేస్తున్నారో తెలియదు... అయినా తీరిక లేకుండా ఆలోచిస్తుంటారు. అలా వెళ్తూ... వేరే రాష్ట్రానికి చేరుకున్నారు. అయినవాళ్లు కానరాక కుటుంబీకులు తల్లడిల్లిపోయారు. మతిస్థిమితం లేక దిక్కుతోచని స్థితిలో తిరుగుతున్న వారిద్దరినీ అధికారులు చేరదీసి స్వస్థలాలకు పంపించి కుటుంబసభ్యుల్లో ఆనందం నింపారు.

MISSING PERSONS CAME BACK TO HOME SAFELY
MISSING PERSONS CAME BACK TO HOME SAFELY

By

Published : Nov 28, 2019, 5:31 AM IST

Updated : Nov 28, 2019, 8:25 AM IST

మతిస్థిమితం కోల్పోయి కేరళ చేరుకున్న ఇద్దరు వ్యక్తులను న్యాయ సేవాధికార సంస్థ స్వస్థలాలకు చేర్చింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన శకుంతల, నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన దశరథ్... కొంత కాలంగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఏడాది క్రితం శకుంతల ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయింది. ఆమె కోసం కుటుంబ సభ్యులు అనేక ప్రాంతాల్లో గాలించినప్పటికీ...... ఆచూకీ లభించలేదు. దశరథ్‌ కూడా అలానే తప్పిపోయాడు. మూడేళ్ల క్రితం ఇంటి నిర్మాణ పనుల కోసం వెళ్లిన దశరథ్​... తిరిగి ఇంటికి రాలేదు. కేరళలోని తిరువనంతపురంలో దీనావస్థలో ఉన్న శకుంతల, దశరథ్‌లను.... కేరళ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ అధికారులు సంరక్షణ కేంద్రానికి తరలించి మానసిక చికిత్స చేయించారు. ఇద్దరూ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించి... న్యాయసేవాధికార సంస్థకు సమాచారమిచ్చారు.

ఆనందంలో కుటుంబాలు...

న్యాయసేవాధికార సంస్థ అధికారులు పోలీసుల సాయంతో బాధితుల కుటుంబసభ్యుల వివరాలు సేకరించారు. అనంతరం కుటుంబసభ్యులు, పోలీసులతో కలిసి కేరళ వెళ్లిన సంస్థ సభ్యులు... దశరథ్‌, శకుంతలను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. తమ నుంచి దూరమై.. ఎక్కడున్నారో తెలియక, ఎప్పుడొస్తారో తెలియక క్షోభకు గురైన కుటుంబీకులు... వారి రాకతో ఆనందంలో మునిగితేలారు. రేపు శకుంతల మనవడి వివాహం జరగనుండటం వల్ల... ఆ ఇంట నూతన శోభ సంతరించుకుంది.

అండగా న్యాయ సేవాధికార సంస్థ...

శకుంతల, దశరథ్​ను కుటంబ సభ్యుల వద్దకు చేర్చేందుకు కష్టపడ్డ అధికారులను రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి జీవీ సుబ్రమణ్యం అభినందించారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి న్యాయసేవాధికార సంస్థ అండగా ఉంటుందని తెలిపారు. మానసిక స్థితి సరిగా లేని అభాగ్యుల పట్ల ఔదార్యం చూపిస్తున్న రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ పనితీరును పలువురు అభినందిస్తున్నారు.

ఆగమైనోళ్లను అయినవాళ్ల దగ్గరికి చేర్చి ఆనందం నింపారు...

ఇది చదవండి: బాంబు పేలి టాలీవుడ్ హీరో సందీప్​ కిషన్​కు గాయాలు

Last Updated : Nov 28, 2019, 8:25 AM IST

ABOUT THE AUTHOR

...view details