హైదారాబాద్ జూబ్లిహిల్స్ పరిధిలోని జవహార్‌నగర్‌లో దారుణం జరిగింది. చేపల వ్యాపారిని అపహరించి క్రూరంగా హత్యచేసిన ఘటన కలకలం సృష్టించింది. ఈనెల 1న బోరబండకు చెందిన చేపల వ్యాపారి రమేశ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. అతడి కుటుంబ సభ్యులు ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమేశ్‌ను ఈఎస్‌ఐ ఆస్పత్రి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా కారులో తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి రమేశ్ ఆచూకీ కోసం రెండురోజులుగా ప్రయత్నించారు.
విచారణ వేగవంతం
జవహార్‌నగర్‌లోని ఓ ఇంటి నుంచి దుర్వాసన వస్తుందనే స్థానికుల సమాచారంతో వెళ్లిన పోలీసులు... హత్య చేసి మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి పడేసినట్లు గుర్తించారు. ఆ మృతదేహం రమేశ్‌దిగా తేల్చారు. ఈనెల 1వ తేదీన రమేశ్‌ను అపహరించి... మరుసటి రోజే అతన్ని హతమార్చి గోనె సంచిలో చుట్టి గదిలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనలో పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రూ.కోటి ఇవ్వాలని ఫోన్ చేసిన వ్యక్తులెవరు, ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలు సేకరిస్తున్నారు.