గ్రామీణ ప్రాంతాల్లో గుడుంబా తయారు చేస్తున్న వ్యక్తులపై పీడీ యాక్ట్, బ్రీచ్ కేసుల నమోదు చేయడం వల్లనే పూర్తిస్థాయిలో కట్టడి చేయగలిగామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రాన్ని గుడుంబా రహితంగా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యమని పేర్కొన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో ఆబ్కారీశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గుడుంబా వల్ల తండాల్లో గిరిజనులు యుక్తవయసులోనే జీవితాలను దుర్భరం చేసుకుంటున్నారని అన్నారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
గుడుంబా రహిత రాష్ట్రమే లక్ష్యం: శ్రీనివాస్ గౌడ్
రాష్ట్రాన్ని గుడుంబా రహితంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు పీడీ యాక్ట్ ద్వారా వరంగల్ రూరల్ జిల్లాలో 12 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. అంతేకాకుండా జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, సూర్యాపేట, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లో 57 బ్రీచ్ కేసుల్లో నిందితులను ఏడాదిపాటు జైలుకు పంపినట్లు తెలిపారు. లాక్ డౌన్ కాలంలో గుడుంబా అమ్మకాలు జరిపిన వారిపై కఠినంగా వ్యవహారించడం వల్లే పూర్తి స్థాయిలో నిర్మూలన జరిగిందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ అజయ్ రావు, డిప్యూటీ కమిషనర్ ఖురేషీ, సహాయ కమిషనర్ హరికిషన్, డీపీఈవోలు చంద్రయ్య, దత్తరాజ్ గౌడ్, గణేష్, ప్రదీప్ రావు, జనార్దన్ రెడ్డి, శ్రీనివాసరావు, రఘురాం, డీఎఫ్వో సత్యనారాయణ, అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.