తెలంగాణ

telangana

ETV Bharat / state

8 నుంచి రాష్ట్రంలోని ముఖ్య పట్టణాల్లో మహిళా వారోత్సవాలు: మంత్రి కేటీఆర్ - Women week celebrations in Telangana

Womens Day Celebrations in Telangana: సమాజంలో మహిళల శక్తిని, పాత్రను గుర్తు చేసుకునేలా రాష్ట్రంలోని ముఖ్య పట్టణాల్లో మార్చి 8వ తేదీ నుంచి మహిళా వారోత్సవాలు జరపాలని మంత్రి కేటీఆర్​ అధికారులను ఆదేశించారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు సన్మానాలు చేయాలని సూచించారు. ముఖ్యంగా చెత్త కాంపోస్టింగ్‌కు అనువైన పద్దతులు అనుసరించిన మహిళలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. మరోవైపు టీఎస్​ఆర్టీసీ కూడా మహిళల కోసం ఆ రోజు ప్రత్యేక బస్సులు నడపనుంది.

Minister KTR
Minister KTR

By

Published : Mar 5, 2023, 1:25 PM IST

Womens Day Celebrations in Telangana: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ముఖ్య పట్టణాల్లో ఘనంగా మహిళా వారోత్సవాలను నిర్వహించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలో మహిళల శక్తిని, పాత్రను గుర్తు చేసుకునేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

మార్చి 8 మహిళా దినోత్సవం రోజు నుంచి ప్రారంభం అయ్యే ఈ వారోత్సవాల్లో.. వివిధ కార్యక్రమాలను పురపాలక శాఖ నిర్వహించనుంది. ముఖ్యంగా పురపాలకలో కీలకపాత్ర వహించి.. వివిధ హోదాలలో ప్రాతినిథ్యం వహిస్తున్న మహిళా ప్రజా ప్రతినిధులు, పురపాలక శాఖ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు, వివిధ ఎన్జీవోల సిబ్బందితో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మంత్రి వివరించారు.

ఈ వారోత్సవాల్లో క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలకు హెల్త్ క్యాంపుల నిర్వహణ, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సన్మానం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఏదైనా ఒక రంగంలో ముఖ్యంగా డ్రై కంపోస్ట్, కిచెన్ కాంపోస్టింగ్, నీటి సంరక్షణ లాంటి మొదలైన రంగాల్లో ఆదర్శవంతమైన పద్ధతుల్లో ముందుకెళ్తున్న పురపాలక సిబ్బంది, పట్టణంలోని మహిళలను ప్రత్యేకంగా గుర్తించి వారిని సన్మానించాలని సూచించారు.

మహిళ స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో తయారైన ఉత్పత్తుల ప్రదర్శన నిర్వహించాలని కేటీఆర్​ తెలిపారు. ప్రభుత్వ రుణాలు, సబ్సిడీలు వంటి వాటిని వినియోగించుకొని స్వయం సమృద్ధి సాధించిన మహిళలకు సన్మానించాలని పేర్కొన్నారు. వీధి వర్తకులు మొదలుకొని.. మహిళా వ్యాపారవేత్తలుగా ఎదిగిన వారిని గుర్తించాలని పేర్కొన్నారు. అంతే కాకుండా వివిధ రంగాలకు చెందిన మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రత్యేకంగా గుర్తించి.. వారిని సత్కరించాలని తెలిపారు.

మహిళల కోసం స్పెషల్​ బస్​లు: మరోవైపు మహిళా దినోత్సవం రోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మహిళలు, విద్యార్థినుల కోసం టీఎస్​ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. నగర శివారు ప్రాంతాల్లో చదివే విద్యార్థినుల కోసం లేడీస్ స్పెషల్ బస్సులను నడుపుతున్నట్లు ప్రకటించింది. గ్రేటర్‌ జోన్‌లోని 10 రద్దీ రూట్లలో 85 మహిళా స్పెషల్‌ సర్వీసులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఉదయం 7.30 నుంచి 9.30 వరకు, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మహిళల ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.

ఇవీ చదవండి:

మహిళా దినోత్సవం స్పెషల్.. 'ఆరోగ్య మహిళ'కు ప్రభుత్వ శ్రీకారం

మహిళ దినోత్సవం సందర్భంగా స్త్రీలకు ఎంపీ సంతోష్​​ సరికొత్త ఛాలెంజ్..

హైదరాబాద్‌ వేదికగా జీ-20 ఆర్థిక సదస్సు సన్నాహక సమావేశాలు షురూ

ABOUT THE AUTHOR

...view details