హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వనస్థలిపురం నుంచి దిల్సుఖ్ నగర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. వనస్థలిపురం నుంచి దిల్సుఖ్ నగర్ వరకు ట్రాఫిక్ కష్టాలు తప్పించేందుకు నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. 700 మీటర్ల పొడవు 12 మీటర్ల వెడల్పుతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు 32 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
హైదరాబాద్‌లోని 'ఎల్బీనగర్- నాగోల్'కు మెట్రో అనుసంధానిస్తామని మంత్రి KTR స్పష్టం చేశారు. హయత్‌నగర్ వరకు విస్తరించడం సహా ఎయిర్‌పోర్టుకు అనుసంధానిస్తామని తెలిపారు. ఈ నియోజకవర్గంలో చేపట్టిన 12 ప్రాజెక్టుల పనుల్లో... ఇప్పటికే 9 పూర్తి చేశామని మంత్రి KTR తెలిపారు. మిగతా మూడు ఫ్లై ఓవర్లను సెప్టెంబర్‌లోపు పూర్తి చేసి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో ప్రాణాలు అర్పించిన శ్రీకాంత్ చారి పేరును ఎల్బీనగర్ కూడలికి పెడతామని కేటీఆర్ ప్రకటించారు.
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చేందుకు.. రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు నగరంలో అవసరమైన చోట్ల ఫ్లై ఓవర్లు, అండర్ పాసింగ్ నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఎస్.ఆర్.డి.పి ద్వారా 47 పనులు ప్రారంభించింది. ఇందులో ఇప్పటివరకు జీహెచ్ఎంసీ నిధులతో 32 పనులు పూర్తయ్యాయి. మిగతా శాఖలకు సంబంధించిన ఆరు పనుల్లో మూడు పూర్తి కాగా మరో మూడు వివిధ ప్రగతి దశలో ఉన్నాయి.