తెలంగాణ

telangana

ETV Bharat / state

వానాకాలం ధాన్యం కొనుగోలుకు 6000 కేంద్రాలు: మంత్రి గంగుల - grain purchase in telangana

రాష్ట్రంలో సుమారు 6 వేల కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించడానికి రంగం సిద్ధం చేసినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. 2020-21 వానా కాలానికి సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై మంత్రి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆ సంస్థ అధికారులు, రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లా స్థాయి రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

minister gangula kamalakar review on paddy procurement
పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌

By

Published : Oct 15, 2020, 7:55 PM IST

తెలంగాణలో 6వేల కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించడానికి ఏర్పాట్లు చేసినట్లు పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ఏర్పాట్లు, కొనుగోలు కేంద్రాల ప్రారంభం సన్నద్ధత, ఇతర మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై మంత్రి సమీక్షించారు. కొనుగోలు ప్రక్రియ ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి సాఫ్ట్‌వేర్ సిద్ధం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ప్రతీ గ్రామంలో కొనుగోలు కేంద్రం

ఈ సీజన్‌లో ప్రభుత్వం కొనుగోలు చేయనున్న ధాన్యం రైస్‌మిల్లర్లు దిగుమతి చేసుకునే విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటానికి వివిధ జిల్లాల మిల్లర్లతో మంత్రి చర్చించారు. మిల్లర్ల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందున పూర్తిగా సహకరించాలని సూచించారు. రైతుల సౌకర్యార్థం.. ప్రతి గ్రామంలో ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించినట్లు తెలిపారు.

131.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా

వానాకాలం వరి సాగు జరిగిన 52.78 లక్షల ఎకరాల్లో... సన్న రకం 34.45 లక్షల ఎకరాలు, దొడ్డు రకాలు 13.33 లక్షల ఎకరాల్లో సాగవుతున్న దృష్ట్యా.. సన్న రకాలు 98.61 లక్షల మెట్రిక్ టన్నులు, దొడ్డు రకాలు 33.33 లక్షల మెట్రిక్ టన్నులు మొత్తం 131.94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాబోతుందని అంచనా వేసినట్లు మంత్రి కమలాకర్‌ తెలిపారు. నికరంగా కొనుగోలు కేంద్రాలకు 75 లక్షల మెట్రిక్ టన్నులు వస్తున్నందున పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేయాలని నిర్ణయించిందని ప్రకటించారు. ఇందుకుగాను కొత్తవి 10.13 కోట్లు, పాతవి 8.63 కోట్లు మొత్తం 18.76 కోట్లు అవసరమైన గోనె సంచులు సమకూర్చుకోవాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

గోనె సంచుల సమస్య ఉత్పన్నం కాకుండా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మిన రైతులకు త్వరగా డబ్బులు అందేటట్లు చూడాలని ఆదేశించిన మంత్రి.. కొనుగోలుకు అవసరమైన సిబ్బందిని కూడా సర్దుబాటు చేసుకోవాలని సూచించారు. మౌలిక సదుపాయాల కల్పన సహా అవసరమైన నిధులు, రవాణా, ఇతర సమస్యలు ఉత్పన్నమైతే తక్షణమే స్పందించడానికి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని మంత్రి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details