తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి తీపికబురు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పొరుగు సేవల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి కనీస వేతనాలను వర్తింపజేయడంపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూత్రప్రాయంగా ఆమోదం తెలపడంతో.. వైద్యఆరోగ్యశాఖ ఆ దిశగా ప్రతిపాదనలు రూపొందిస్తోంది.

minimum wages to government hospitals sanitation staff in telangana
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బందికి తీపికబురు

By

Published : Sep 18, 2020, 7:13 AM IST

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పొరుగు సేవల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య, భద్రత, రోగులకు సేవలందించే సిబ్బంది వేతనాల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూత్రప్రాయంగా ఆమోదం తెలపడంతో.. వైద్యఆరోగ్యశాఖ ఆ దిశగా ప్రతిపాదనలు రూపొందిస్తోంది. ఈ విషయమై బుధ, గురువారాల్లో వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఉన్నతస్థాయి అధికారుల సమావేశాన్ని నిర్వహించారు. కార్మిక, ప్రజాసంఘాల నేతల సూచనలూ స్వీకరించారు. త్వరలోనే ముఖ్యమంత్రి నుంచి తీపికబురు వెలువడనున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి.

పలుమార్లు ఆందోళనలు

ప్రస్తుతం ప్రభుత్వాసుపత్రుల్లో పారిశుద్ధ్య, భద్రత, రోగుల సంరక్షకుల సేవలకు టెండర్‌ విధానంలో ప్రైవేటు సంస్థను ఎంపిక చేస్తున్నారు. ఒక్కో పడకకు రూ.5వేల చొప్పున ప్రభుత్వం నిర్ణయించింది. మూడేళ్ల కిందట ఈ టెండర్లు జరిగినప్పుడు అమల్లో ఉన్న జీవోల ప్రకారంగా.. ఒక్కో పారిశుద్ధ్య, రోగుల సంరక్షకుడికి నెలకు రూ.9225, భద్రతా సిబ్బందికి రూ.9555 చొప్పున చెల్లించాలి. ఉద్యోగి పనిచేసిన రోజులకే వేతనం వస్తుంది. దీంతో పారిశుద్ధ్య, రోగుల సంరక్షణ సిబ్బందికి నెలకు రూ.8400, భద్రతా సిబ్బందికి నెలకు రూ.8700 వరకూ అందుతోంది. విధులకు హాజరు కాలేకపోతే.. ఆ నెల వేతనం సగానికంటే తగ్గిన సందర్భాలు ఉన్నాయని ఆసుపత్రుల్లో ఆందోళనలు చేశారు. కొవిడ్‌ విధుల్లో పాల్గొంటున్న సమయంలోనూ వేతనాలు పెంచాలని కోరారు. వీరి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో సానుకూలంగా స్పందించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

ప్రస్తుత విధానంలో మార్పులు

ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని సమూలంగా మార్చే దిశగా వైద్యఆరోగ్యశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇతర రాష్ట్రాలు, నిమ్స్‌లో అమలు చేస్తున్న విధానాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఉదాహరణకు గాంధీ ఆసుపత్రిలో 1000 పడకలకు టెండర్‌ పిలిచారు. ఆ పడకలకు 103 మంది భద్రతా సిబ్బంది, 103 మంది రోగుల సంరక్షకులు, 185 మంది పారిశుద్ధ్య సిబ్బంది అవసరమని లెక్కగట్టారు. అదే తీరున ఉస్మానియాలోనూ 1100 పడకలకు టెండరు పిలిచారు. వాస్తవానికి రెండుచోట్ల 1800కు పైగా పడకలను నిర్వహిస్తున్నారు. కానీ ఎన్ని పడకలకు టెండరులో కేటాయిస్తే.. వాటికి సరిపోయేంత సిబ్బందిని మాత్రమే సంస్థ సమకూర్చుతుంది. దీన్ని చక్కదిద్దాలని ప్రభుత్వం ఆదేశించింది.

నిమ్స్‌ మాదిరిగా..

  • ఒక్కో పడకకు ప్రస్తుతం కేటాయిస్తున్న మొత్తాన్ని దాదాపు 40-50 శాతం వరకూ పెంచే అవకాశాలున్నాయని వైద్యవర్గాలు తెలిపాయి.
  • నిమ్స్‌లో ప్రస్తుతం పొరుగు సేవల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఏవిధంగా వేతనాలు చెల్లిస్తున్నారో.. అలాగే చెల్లించేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు తెలిసింది.
  • నిమ్స్‌లో పారిశుద్ధ్య సిబ్బందికి నెలకు రూ.16980 చొప్పున చెల్లిస్తున్నారు. ఇందులో 12 శాతం పీఎఫ్‌ కోత పోగా.. సుమారు రూ.14,943 చొప్పున నెలకు వేతనం అందుతోంది.
  • ఈ లెక్కన సుమారు 6 వేల మంది పారిశుద్ధ్య, భద్రత, రోగి సంరక్షకులకు నెలకు సుమారు రూ.3వేల నుంచి రూ.4 వేల వరకూ జీతం పెరిగే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

ఇదీ చూడండి:కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డ తండ్రి అరెస్ట్!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details