రాష్ట్రవ్యాప్తంగా కరోనా నేపథ్యంలో రోగులూ తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వైద్యుల వద్దకు సంప్రదింపులకు కూడా వారు వెళ్లలేకపోతున్నారు. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, మూత్రపిండాలు, గుండె, కాలేయ సమస్యలతో బాధపడేవారికి ఈ మహమ్మారి తీవ్ర సమస్యగా పరిణమించింది. వచ్చే నెల 15 వరకూ రాష్ట్రంలో కర్ఫ్యూ కొనసాగుతుందని ప్రభుత్వం తాజాగా స్పష్టం చేయడం వల్ల.. ముందస్తు ప్రణాళిక ద్వారా వైద్యనిపుణుల సంప్రదింపులను పొందాలనుకునే వారి కోసం కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు ఆన్‌లైన్ వైద్యసేవలు అందుబాటులోకి తెచ్చాయి.
అవసరమైతే రోగిని వీడియోకాల్ ద్వారా వైద్యుడు చూసి, నిర్ధరణ పరీక్షల ఫలితాలను డిజిటల్ విధానంలోనే పరీక్షించి, సలహాలు, ఔషధాలు సూచించేలా ఏర్పాట్లు చేశాయి. వీటిల్లో ముందస్తు అపాయింట్‌మెంట్ తీసుకొని, నిర్దేశిత సమయం ప్రకారం సలహాలు, సూచనలు పొందేవారికి అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కరోనా ముప్పు అధికంగా ఉండడం వల్ల.. అటువంటివారికి ఈ తరహా వైద్యసేవలు ఉపశమనంగా నిలుస్తాయని అక్కడి వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ఆన్‌లైన్ సంప్రదింపుల్లో భాగంగా కొన్ని ఆసుపత్రులు ఉచిత సేవలందిస్తుండగా.. ఇంకొన్ని మాత్రం రుసుములు వసూలు చేస్తున్నాయి. వాటి వివరాలివీ.
అపోలో ఆసుపత్రి
- http: //nmc.sg/cXDvR4 .. ఇది అపోలో ఆసుపత్రి టెలీమెడిసిన్ యాప్. దీన్ని సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకొని 24 గంటలూ వైద్యసేవలు పొందొచ్చు.
- ముందస్తు అపాయింట్‌మెంట్ ద్వారా వైద్యనిపుణులు అందుబాటులో ఉంటారు.
- రోగుల అవసరం మేరకు వీడియోకాల్‌లో కూడా వైద్యులు అందుబాటులోకి వస్తారు.
- అపోలో డయాగ్నొస్టిక్స్ ద్వారా వైద్య పరీక్షలు, ఫార్మసీ ద్వారా ఔషధాలూ పొందొచ్చు.
- వైద్య సేవలకు నిర్దేశిత రుసుములను వసూలు చేస్తారు.
కిమ్స్ ఆసుపత్రి
- ముందస్తు అపాయింట్‌మెంట్‌కు 040-44885000 నంబరుకు రోగులు ఫోన్‌చేస్తే.. వారి సెల్‌ఫోన్‌కు ఒక లింకు వస్తుంది.
- దానిపై క్లిక్ చేస్తే ఆన్‌లైన్‌లో కోరుకున్న వైద్యుడితో తమ సమస్యలను తెలియజేయవచ్చు.
- అవసరమైతే వీడియోకాల్‌లోనూ వైద్యులు అందుబాటులోకి వస్తారు.
- తమ ఆసుపత్రిలో ఉన్న 400 మంది స్పెషలిస్టు వైద్యుల సేవలను దేశవ్యాప్తంగా ఎక్కడినుంచైనా వినియోగించుకోవచ్చనీ, దీనికి నిర్దేశిత రుసుమును చెల్లించాల్సి ఉంటుందని కిమ్స్ ఆసుపత్రి సీఈవో డాక్టర్ అభినయ్ తెలిపారు.
సన్‌షైన్ ఆసుపత్రి
- రోగుల సందేహాల నివృత్తికి ‘ఎం-ఫిన్’ అనే హెల్ప్‌లైన్‌ను ప్రవేశపెట్టారు.
- తొలుత 040-44550000 నంబరుకు ఫోన్ చేసి, రోగి సెల్‌ఫోన్ నంబరు, పేరు, ప్రాంతం.. వివరాలు ఇవ్వాలి. అనంతరం ‘ఎం-ఫిన్’ లింకు రోగి సెల్‌ఫోన్ నంబరుకు వస్తుంది.
- సంబంధిత లింకుపై క్లిక్ చేయగానే.. ఆసుపత్రి వైద్యుడు వీడియో కాల్‌లో ప్రత్యక్షమవుతారు.
- 24 గంటలూ ఈ లైన్ అందుబాటులో ఉంటుంది.
- ప్రస్తుత ఆపత్కాలంలో రోగులకు ఇబ్బందుల్లేకుండా సహాయం చేయాలనేది తమ లక్ష్యమనీ, వైద్యుడు సమస్యను విని, సలహాలు ఇస్తారని సన్‌షైన్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ గురవారెడ్డి తెలిపారు. ఈ సేవలను ఉచితంగానే అందిస్తామన్నారు.